తిరువనంతపురం : కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడి ప్రాణాలను నిఫా వైరస్ బలిగొంది. ఈ వైరస్ సోకి కోజికోడ్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు మృతి చెందినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఆదివారం తెలిపారు. బాలుడు కార్డియాక్ అరెస్టుతో మరణించినట్లు మంత్రి వెల్లడించారు. నిఫా వైరస్ ఇన్ఫెఫెక్షన్‌తోనే బాలుడు మరణించినట్లు పూణేకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కూడా నిర్థారించింది. 2018లో నిఫా వైరస్ కారణంగా మలప్పురం, కోజికోడ్ జిల్లాల్లో 17 మంది మరణించారు.
అయితే, ప్రస్తుతం నిఫా వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదని మంత్రి వీణా జార్జ్ తెలిపారు. మృతి చెందిన బాలుడికి చెందిన ముగ్గురు బంధువులు కోజికోడ్ ఆసుపత్రిలో పర్యవేక్షణలో ఉన్నారని, అతనితో సన్నిహితంగా ఉన్న మరో నలుగురు మంజేరి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో పరిశీలనలో ఉన్నారని మంత్రి చెప్పారు. వీరిలో ఎవ్వరికీ కూడా నిఫా వైరస్ లక్షణాలు కనిపించడం లేదని చెప్పారు. ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు.
