గడ్డుకాలమే..!

  • మందకోడిగా ఆర్ధిక వ్యవస్థ 
  • నాలుగేళ్ల కనిష్టానికి జిడిపి
  • 6.4 శాతం లోపే ఉంటుందని అంచనా
  • ఎకనామిక్‌ సర్వేలో మంత్రి సీతారామన్‌

న్యూఢిల్లీ : భారత ఆర్ధిక వ్యవస్థ మందకోడిగా ఉందని ఆర్ధిక సర్వేలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ స్వయంగా పేర్కొన్నారు. బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా శుక్రవారం పార్లమెంట్‌లో ఎకనామిక్‌ సర్వే 2024-25ను ఆమె ప్రవేశపెట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కీలకమైన ఈ నివేదికలో వృద్ది రేటు మందకొడిగా ఉందని పేర్కొనడం విశేషం. ప్రైవేటు వినిమయంలో కూడా పెరుగుదల కనిపించడం లేదని, స్థిరంగా ఉంటోందని తెలిపారు. దీంతో ప్రజల కొనుగోలు శక్తి కూడా ఏమాత్రం పెరగడం లేదన్న విషయం అర్ధమవుతోంది. తయారీ రంగం క్షీణించడం కూడా దీనికో నిదర్శనం. ఆర్థిక సర్వేలో పేర్కొన్న వివరాల ప్రకారం గతేడాది తయారీ రంగంలో పురోగతి లేకపోగా అంతకుముందు సంవత్సరంలో పోలిస్తే మందగించింది. దీనికి తోడు కార్పొరేట్‌ పెట్టుబడులు తగ్గాయి. ఫలితంగా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం (2024-25)లో భారత వృద్ధి రేటు 6.4 శాతానికి పరిమితం కానుందని నివేదికలో పేర్కొన్నారు. గత నాలుగేళ్లలో ఇదే అత్యల్పం. 2023-24లో 8.2 శాతం, 2022-23లో 7.2 శాతం, 2021-22లో 8.7 శాతం చొప్పున వృద్ధి చోటు చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. వచ్చే 2025-26లో జిడిపి 6.3-6.8 శాతంగా ఉండొచ్చని అంచనా. 2024-25 ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో వృద్ధి రేటు ఏకంగా 5.4 శాతానికి క్షీణించి.. దాదాపు రెండేళ్ల కనిష్ట స్థాయి వద్ద నమోదయ్యింది. ఇది ఆర్‌బిఐ అంచనా వేసిన 7 శాతం కంటే తక్కువ.

అభివృద్ధి చెందుతున్నామంటూనే…

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్‌ నిలువనుందని మోడీ సర్కార్‌ పదేపదే ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం వచ్చే రెండు దశాబ్దాల పాటు భారత్‌ స్థిరంగా 8 శాతం వద్ధి రేటును నమోదు చేయాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే తెలిపింది. తాజా జిడిపి అంచనాలతో ఆలక్ష్యం అందుకోవడం ప్రశ్నార్ధకంగా మారింది.

ఆహార ధాన్యాల ధరలు తగ్గడం కష్టమే

ఆర్థిక సర్వేలో పేర్కొన్న అంచనాల ప్రకారం ఆహార ధాన్యాల ధరలు తగ్గుముఖం పట్టడం దాదాపు అసాధ్యమే! రబీ పంట దిగుబడి బాగుంటే 2026 ప్రధమార్ధంలో ఆహార ధరలు తగ్గే అవకాశం ఉందని నివేదికలో తెలిపారు. దీనర్ధం ఈ ఏడాదంతో అధిక ధరలు కొనసాగుతాయనే! ఈ మాట చెబుతూనే ప్రస్తుత జనవరి-మార్చి త్రైమాసికంలో అహార ద్రవ్యో ల్బణం తగ్గే అవకాశం ఉందని పేర్కొనడం విశేషం.

స్టాక్‌ మార్కెట్లు మరింత పతనం

‘పారిశ్రామిక రంగం కూడా కరోనాకు ముందున్న స్థాయిలో రాణిస్తోంది. సేవల రంగం బలంగా ఉంది. ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తోంది. రిటైల్‌ ద్రవ్యోల్బణం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 5.4 శాతం నుంచి 2024-25 ఏప్రిల్‌-డిసెంబర్‌ కాలంలో 4.9 శాతానికి తగ్గింది. బ్యాంకింగ్‌, బీమా రంగం స్థిరంగా ఉంది. బ్యాంకింగ్‌లో 2024 సెప్టెంబర్‌ నాటికి స్థూల నిరర్ధక ఆస్తులు 2.6 శాతానికి తగ్గాయి. 2023-24లో బీమా ప్రీమియంలు 7.7 శాతం పెరిగి రూ.11.2 లక్షల కోట్లకు చేరుకున్నాయి. వాహన, గృహ, వ్యక్తిగత రుణాల విభాగంలో మందగమనం చోటు చేసుకుంది. భౌగోళిక, రాజకీయ అస్థిరతల వల్ల డాలర్‌ బలపడడంతో రూపాయి మారక విలువ పడిపోయింది. 2025లో స్టాక్‌ మార్కెట్‌లు కొంత పడిపోయే అవకాశం ఉంది. గ్లోబల్‌ ఐపిఒ లిస్టింగ్స్‌లో భారత్‌ వాటా 2023లో 17 శాతం నుంచి 2024 నాటికి 30 శాతానికి చేరింది. 2024 నవంబర్‌ వరకు మొత్తం మూలధన వ్యయంలో రక్షణ, రైల్వేలు, రోడ్డు రవాణా వాటా 75 శాతంగా ఉంది.” అని ఎకనామిక్‌ సర్వే తెలిపింది.

➡️