- కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ డిమాండ్
న్యూఢిల్లీ : ప్రజాస్వామ్యాన్ని నిర్వీరం చేసినందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్ ద్వారా మొత్తం ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌పై విచారణ జరిపించాలని కోరింది. ఎలక్టోరల్ బాండ్ల పేరుతో స్కామ్ జరిగిందన్న ఆరోపణలపై నిర్మలా సీతారామన్, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాపై తాజాగా కేసు నమోదైన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు అభిషేక్‌సింఘ్వి ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా డబ్బు వసూలు చేసేందుకు నాలుగు పద్ధతులను బిజెపి ఉపయోగించిందని ఆయన విమర్శించారు. గతేడాది కాలంలో మీడియా ఎలక్టోరల్ బాండ్లపై అనేక కథనాలు, పేర్లను ప్రచురించాయని తెలిపారు. చాలా కేసుల్లో మొదట దర్యాప్తు సంస్థలు కంపెనీలపై దాడులు చేశాయని.. ఆ తర్వాత ఆయా కంపెనీలు చాలా ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేశాయని చెప్పారు. బాండ్ల కొనుగోలు తర్వాత కేసుల దర్యాప్తు వేగం మందగించిందన్నారు. రూ.100కోట్ల మూలధనం లేని కంపెనీలు రూ.500కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయడం చూశామన్నారు. ఎలక్టోరల్ బాండ్ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడమే నాలుగో అంశమని సింఘ్వీ అన్నారు. ఏదైనా కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలనే నిబంధన ఉందని.. కేసు ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశించిందన్నారు.