న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, భారీ పరిశ్రమల శాఖామంత్రి ఎలక్ట్రిక్ వాహనాల కోసం సబ్సిడీలు ఇస్తే తనకెలాంటి సమస్యా లేదని కేంద్ర రోడ్డు రవాణా శాఖామంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. సోమవారం ఢిల్లీలో జరిగిన ఆటోమోబైల్ కాంపోనెంట్ మాన్యుఫాక్చర్స్ అసోసియేషన్ (ఎసిఎంఎ) 64వ వార్షికోత్సవ కార్యక్రమంలో గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రారంభంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ఖర్చులు ఎక్కువగా ఉండేవి. కానీ డిమాండ్ పెరగడంతో వాటి ఉత్పత్తి ఖర్చులు తగ్గాయి. అయితే వీటి తయారీకి సబ్సిడీలు అనవసరం. ఇప్పుడు వినియోగదారులు ఎలక్ట్రిక్ అండ్ సిఎన్‌జి (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) వాహనాలను ఎంచుకుంటున్నారు. పెట్రోల్, డీజిల్ వాహనాలకు 28 శాతం జిఎస్‌టి ఉంటే ఎలక్ట్రిక్ వాహనాలకు జిఎస్‌టి 5 శాతమే ఉంది. అయినప్పటికీ ఎలక్ట్రిక్ వాహనాలకు ఇప్పుడు సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను’ అని ఆయన అన్నారు.
