బల పరీక్ష నెగ్గిన నితీష్‌ సర్కార్‌

Feb 13,2024 08:49 #Bihar Assembly, #Nitish Kumar

పాట్నా : బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం సోమవారం విశ్వాస పరీక్షలో నెగ్గింది. ప్రతిపక్ష మహాఘట్‌బంధన్‌ సభ్యులు సభ నుండి వాకౌట్‌ చేశారు. మెజారిటీ ఓటుతో ప్రభుత్వం నెగ్గిందని జనతాదళ్‌ (యునైటెడ్‌) కి చెందిన డిప్యూటీ స్పీకర్‌ మహేశ్వర్‌ హజారి సభలో ప్రకటించారు. 243 మంది సభ్యులు గల సభలో మహాఘట్‌బంధన్‌ సభ్యులందరూ వాకౌట్‌ చేశారు. జెడియుకి చెందిన ఒక ఎంఎల్‌ఎ బలపరీక్షకు గైర్హాజరయ్యారు. మరో ఎంఎల్‌ఎ హజారి డిప్యూటీ స్పీకర్‌గా సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నందున ఆయన ఓటు వేయలేరు. అందువల్ల ఎన్‌డిఎకి 126మంది సభ్యులు వున్నారు. ముగ్గురు ఆర్‌జెడి సభ్యులు కూడా ఓటు వేయడంతో 129మంది మద్దతిచ్చినట్లైంది.

భారతరత్న అవార్డులపై ఒప్పందం కుదుర్చుకున్నారు : తేజస్వి యాదవ్‌

భారతరత్న అవార్డులపై బిజెపి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుందని బీహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ విమర్శించారు. సోమవారం ఆయన విధాన సభలో మాట్లాడుతూ.. ‘కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న అవార్డు లభించినందుకు సంతోషిస్తున్నాను. బిజెపి వాళ్లు మాతో ఒప్పందం కుదుర్చుకుంటే.. మీకు భారతరత్న అవార్డును ఇస్తాం అనే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్‌లో బిజెపిని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఒకే టెర్మ్‌లో మూడుసార్లు నితీష్‌కుమార్‌ సిఎంగా ఎందుకు ప్రమాణ స్వీకారం చేశారంటే ఏమి సమాధానం చెబుతారని ఆ పార్టీ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు.

➡️