నేరస్తులకు రక్షణ కల్పిస్తున్న నితీష్‌కుమార్‌ : తేజస్వియాదవ్‌

Mar 12,2025 15:32 #Bihar, #Tejaswi Yadav

పాట్నా : బీహార్‌ రాష్ట్రంలో నేరస్తులకు సిఎం నితీష్‌కుమార్‌ రక్షణ కల్పిస్తున్నారని ఆర్‌జెడి నేత, మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వియాదవ్‌ విమర్శించారు. నితీష్‌ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. నేరాలు పెరిగిపోతున్నాయని తేజస్వి ఆరోపించారు. ఇటీవల బీహార్‌లో తనిష్క్‌ షోరూమ్‌లో దొంతనం జరిగింది. సుమారు 25 కోట్ల రూపాయల బంగారు నగల్ని దొంగతనం చేశారు. ఈ నేపథ్యంలో బుధవాం తేజస్వి మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని మీరందరూ గమనించే ఉంటారు. నేరస్తులకు అడ్డుఅడుపు లేకుండా పోయింది. దొంగలు రాత్రిపూట మాత్రమే దొంగతనం చేయడం లేదు. పట్టపగలే.. అందరూ చూస్తుండగానే వారు దొంగతనాలకి పాల్పడుతున్నారు’ అని ఆయన అన్నారు.
ఇటీవల రాష్ట్రంలోని భోజ్‌పూర్‌, హాజిపూర్‌ స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల సిఎం నితీష్‌ కుమార్‌ సొంత జిల్లా అయిన నలందాలో ఒక బాలికను అమానుషంగా హింసించారు. ఆమె పాదాలకు మేకులు దిగగొట్టి పొలాల్లో పడేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించలేదు. బీహార్‌లో నేరాల రేటు పెరిగిపోతుందని జాతీయ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో గణాంకాలే చెబుతున్నాయి అని తేజస్వియాదవ్‌ అన్నారు.
కొన్ని జిల్లా జైళ్లల్లో హింస కారణంగా ఖైదీలు చనిపోతున్నారు. ఈ ఘటనలపై ప్రభుత్వం ఏవిధంగా స్పందించడం లేదు. దీన్నిబట్టి చూస్తే సిఎం నేరస్తుల్ని రక్షిస్తున్నారు. ఈయన హయాంలో చాలామంది నేరస్తులు జైళ్లనుంచి విడుదలయ్యారు. నితీష్‌ కుమార్‌ నేరస్తులకు అనుకూలంగా చట్టాన్ని కూడా మారుస్తున్నారు అని తేజస్వియాదవ్‌ విమర్శించారు.

➡️