న్యూఢిల్లీ : స్టోర్ రూమ్‌లో బయటపడిన నగదుతో తనకు లేదా తన కుటుంబ సభ్యులకు ఎటువంటి సంబంధం లేదని ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ పేర్కొన్నారు. తనను ఇరికించి, అప్రతిష్టపాలు చేయడానికి చేసిన కుట్రగా స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఇటీవల ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో లెక్క చూపని సొమ్ము పెద్ద మొత్తంలో బయటపడిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ డి.కె ఉపాధ్యాయకు జస్టిస్ యశ్వంత్ వర్మ తన సమాధానం దాఖలు చేశారు. శనివారం దాఖలు చేసిన నివేదిను సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో పోస్టయింది.
తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రతిస్పందనలో పేర్కొన్నారు. తనపై ఆరోపణలు ప్రసారం చేసి, అప్రతిష్ట కలిగించే ముందు మీడియా కొంత విచారణ చేపట్టి ఉండాల్సిందని కూడా నివేదికలో పేర్కొన్నారు. తన నివాసంలోని అవుట్‌హౌస్ స్టోర్‌రూమ్‌లో నగదు ఉన్న సంగతి తనకు తెలియదని ఆరోపించారు.
ఘటన గురించి వివరిస్తూ.. మార్చి 14 రాత్రి తన అధికారిక నివాసంలోని సిబ్బంది క్వార్టర్స్ సమీపంలో ఉన్న స్టోర్ రూమ్‌లో మంటలు చెలరేగాయని వర్మ పేర్కొన్నారు. ఆ గదిని సాధారణంగా అందరూ వినియోగిస్తారని, ఎవరూ వినియోగించని ఫర్నీచర్, పరుపులు, కార్పెట్‌లు, పాతస్పీకర్లు, తోట పనిముట్లు సిపిడబ్ల్యుడి మెటీరియల్ వంటి వస్తువులను నిల్వ చేస్తామని అన్నారు. మెయిన్ డోర్ నుండి సిబ్బంది క్వార్టర్స్ వెనుక తలుపునుండి ఆగదిలోకి వెళ్లే అవకాశం ఉందని అన్నారు. ప్రధాన నివాసం నుండి ఆ గదిలోకి వెళ్లే అవకాశం లేదని, జాతీయ మీడియాల్లో పేర్కొన్నట్లు ఆ గది తన ఇంట్లో భాగం కాదని అన్నారు.
ప్రమాదం జరిగిన రోజు తాను, తన భార్య ఢిల్లీలో లేమని, తన కుమార్తె, తన తల్లి మాత్రమే ఉన్నారని అన్నారు. మార్చి 15 సాయంత్రం భోపాల్ నుండి ఇండిగో విమానంలో తాను, తన భార్య తిరిగి ఢిల్లీకి చేరుకున్నామని అన్నారు. అగ్ని ప్రమాదం జరిగినపుడు తన కుమార్తె, తన సెక్రటరీ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారని అన్నారు. మంటలను ఆర్పే ప్రయత్నంలో అగ్ని మాపక సిబ్బంది తన ఇంటి సభ్యులను దూరంగా వెళ్లాలని కోరారు. మంటలు ఆరిన తర్వాత, సంఘటనా స్థలానికి తిరిగి వెళ్లినపుడు, అక్కడ నగదు చూడలేదని అన్నారు.