సిఎఎను ఎవరూ రద్దు చేయలేరు?

May 17,2024 00:47 #CAA, #coments, #PM Modi
  •  యుపి ఎన్నికల ప్రచార సభలో మోడీ

లక్నో : వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) విషయంలో ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎఎపై అబద్దాలు ప్రచారం చేస్తూ దేశంలో అల్లర్లకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర ప్రదేశ్‌ పర్యటనలో ఉన్న ఆయన ఆజంగర్‌లోని లాల్‌గంజ్‌లో నిర్వహించిన పోల్‌ ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. ”సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి), కాంగ్రెస్‌ లాంటి పార్టీలు సిఎఎపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయి. మోడీ సిఎఎ తెచ్చారనీ, ఆయన వెళ్లిన రోజు సిఎఎ రద్దవుతుందని ఇండియా బ్లాక్‌ చెప్తోంది. సిఎఎను రద్దు చేయగలిగే వారెవరైనా ఈ దేశంలో పుట్టారా? సిఎఎను ఎవరూ తొలగించలేరు. ఓటు బ్యాంకు, హిందూ-ముస్లిం కొట్లాటకు ప్రయత్నించిన వారి (ఇండియా బ్లాక్‌) నకిలీ లౌకికతత్వ తెరను తొలగించాను” అని ప్రధాని చెప్పారు. ఎస్‌పి, కాంగ్రెస్‌లు దేశ బడ్జెట్‌ను విభజించి 15 శాతం మైనారిటీలకు కేటాయించాలనుకుంటున్నాయని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ‘టిఎంసి’ రాజకీయాలు చేయాలని కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. ప్రతిపక్షాలు టిఎంసి అభ్యర్థిని బరిలోకి దింపిన భాదోహి లోక్‌సభ నియోజకవర్గంలో మోడీ గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ స్థానంలో ఎస్‌పి, కాంగ్రెస్‌లకు డిపాజిట్‌ కూడా రావడం కూడా కష్టమని, అందుకే టిఎంసి అభ్యర్థిని నిలిపారని ఆరోపించారు. భారతదేశం శక్తి గురించి ప్రపంచానికి తెలియజేసే బలమైన ప్రభుత్వాన్ని నడపగల ప్రధానమంత్రిని ఎన్నుకోవడానికే ఈ ఎన్నికలని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాన్ని తయారు చేయడమే తన లక్ష్యమని చెప్పారు.

➡️