- అధికారిక డాక్యుమెంట్లను వాటి ద్వారా పంపొద్దు
- ప్రభుత్వాధికారులకు జమ్మూకాశ్మీర్ ఆదేశాలు
జమ్మూకాశ్మీర్ : అధికారిక డాక్యుమెంట్లను పంపించే విషయంలో థర్డ్-పార్టీ ప్లాట్‌ఫామ్‌లైన వాట్సాప్, జీమెయిల్‌లను ఉపయోగించటాన్ని జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం నిషేధం విధించింది. సమగ్రత, భద్రతను కారణాలుగా పేర్కొన్నది. థర్డ్-పార్టీ ప్లాట్‌ఫామ్‌ల ఉపయోగం ద్వారా ఉండే ముప్పుును ఎత్తి చూపింది. ఈ మేరకు సున్నితమైన, అధికారిక సమాచార మార్పిడి విషయంలో ప్రభుత్వం సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం.. గోప్యత, పరిమిత సమాచార మార్పిడి, ప్రసారం కోసం ప్రభుత్వాధికారులు ఇక ప్రభుత్వ ఈమెయిల్ సర్వీసులను, దాని తక్షణ సురక్షిత సందేశ ప్లాట్‌ఫామ్‌లను కచ్చితంగా ఉపయోగించాలే ఆదేశాలు జారీ అయ్యాయి. సున్నిత, రహస్య, గోప్యమైన సమాచార ప్రసార విషయంలో థర్డ్-పార్టీ టూల్స్ అయిన వాట్సాప్, జీమెయిల్, ఇలాంటి ఇతర ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగిస్తున్న ట్రెండ్ అధికారుల్లో పెరిగిపోతున్నదన్న విషయం యంత్రాంగం దృష్టికి వచ్చిందని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ కమిషనర్ సెక్రెటరీ సంజీవ్ వర్మ అన్నారు. థర్డ్-పార్టీ టూల్స్‌ను ఉపయోగించటం ద్వారా అది అనధికారిక యాక్సెస్, సమాచార ఉల్లంఘన, రహస్యమైన సమాచార లీక్‌కు దారి తీయగలదని తెలిపారు. వాట్సప్, జీమెయిల్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో కఠినమైన భద్రతా ప్రోటోకాల్‌లు లేవని ఆయన నొక్కి చెప్పారు. అలాంటి టూల్స్‌ను ఉపయోగించటం ద్వారా ప్రభుత్వ కార్యకలాపాల సమగ్రత దెబ్బతింటుందనీ, తీవ్రమైన భద్రతా ఉల్లంఘనలకు దారి తీస్తుందని తెలిపారు. వీటికి బదులుగా ప్రభుత్వ మెసెజింగ్ ప్లాట్‌ఫామ్‌లైన ఎన్‌ఐసీ ఈమెయిల్, సంవాద్, సందేశ్‌లను ఉపయోగించాలని ప్రభుత్వాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.