సభ్యులకు బిల్లు ప్రతుల పంపిణీ
బోర్డుకు ఆస్తి నిర్ణయాధికారాల తొలగింపు
న్యూఢిల్లీ : యునిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్, ఎంపవర్‌మెంట్, ఎఫీషియన్సీ అండ్ డెవలప్‌మెంట్ యాక్ట్, 1995ని ఈ వారంలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడానికి కేంద్రం రంగం సిద్ధం చేసింది. ‘ఏదైనా ఒక ఆస్తి వక్ఫ్ ఆస్తి అవునా, కాదా అని నిర్ణయించడానికి బోర్డుకు గల అధికారాలకు సంబంధించిన సెక్షన్ 40ని తొలగించి’ ప్రతిపాదిత చట్టాన్ని రూపొందించారు. చట్టాన్ని సవరించాలంటూ పేదలైన ముస్లిం గ్రూపులు దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నాయని, వాటిని దృష్టిలో పెట్టుకునే ఈ చట్టాన్ని సవరిస్తున్నామంటూ కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు.
కేంద్ర వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర వక్ఫ్ బోర్డుల్లో ముస్లిములు, ముస్లిమేతరులకు ప్రతిపాదిత చట్టం ప్రాతినిధ్యం కల్పిస్తుంది. ఈ బిల్లు ప్రతులను బుధవారం లోక్‌సభ సభ్యులకు అందజేశారు. ”బహ్రాలు, అఘాఖానీలకు ప్రత్యేకంగా అకఫ్ బోర్డు ఏర్పాటుకు ఈ బిల్లు వెసులుబాటు కల్పిస్తోంది. షియా, సున్ని, బహ్రా, అగాఖాని, ముస్లిం కమ్యూనిటీల్లోని ఇతర వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు కూడా హామీ ఇస్తోంది.
‘అకఫ్ యొక్క మెరుగైన పరిపాలన కోసం, అలాగే దానికి సంబంధించిన ఇతర విషయాల కోసం వక్ఫ్ చట్టం, 1995 రూపొందించబడింది.’ అని మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. చట్టం అమలు సమయంలో, అకఫ్ పరిపాలనను మెరుగుపరచడంలో ఈ చట్టం సమర్ధవంతంగా పనిచేయడం లేదని అభిప్రాయపడినట్లు తెలిపారు.
జస్టిస్ (రిటైర్డ్) రాజిందర్ సచార్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులు, వక్ఫ్, కేంద్ర వక్ఫ్ కౌన్సిల్‌పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ నివేదికలను ఆధారంగా చేసుకుని ఇతర పక్షాలతో కూడా సవివరమైన సంప్రదింపులు జరిపిన తర్వాత 2013లో ఈ చట్టానికి సమగ్రమైన సవరణలు తీసుకొచ్చినట్లు బిల్లు లక్ష్యాలపై చేసిన ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. సవరణలు చేసినప్పటికీ, రాష్ట్ర వక్ఫ్ బోర్డుల అధికారాలకు సంబంధించిన సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరించేందుకు ఈ చట్టాన్ని మరింత మెరుగుపరచాల్సిన అవసరముందని ఆ ప్రకటన పేర్కొంది. వక్ఫ్ నిర్వచనంతో సహా వక్ఫ్ ఆస్తుల నమోదు, సర్వే, ఆక్రమణల తొలగింపునకు సంబంధించిన అంశాలను పరిష్కరించాలంటే చట్టానికి మరింత పదును పెట్టాల్సిన అవసరముందని భావించినట్లు ఆ ప్రకటన పేర్కొంది.
ఇస్లామిక్ చట్టం కింద మతపరమైన లేదా దాతృత్వ ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా కేటాయించిన ఆస్తుల సంరక్షణను వక్ఫ్ చూస్తుంది. ప్రస్తుతం వక్ఫ్ బోర్డుల కింద 8.7 లక్షల ఆస్తులు వున్నాయి. వీటి విలువ రూ.1.2 లక్షల కోట్లు. దేశవ్యాప్తంగా 9.4 లక్షల ఎకరాల్లో ఈ ఆస్తులు విస్తరించి వున్నాయి. సాయుధ బలగాలు, ఇండియన్ రైల్వేస్ తర్వాత మూడో స్థానంలో అత్యధికంగా భూములను కలిగివుంది. ఈ చట్టాన్ని చివరిసారిగా 2013లో సవరించారు. వక్ఫ్‌కు సంబంధించిన నిర్దిష్ట నిబంధనలు, వక్ఫ్ పోర్టల్, డేటాబేస్‌ల వివరాల నమోదు, వక్ఫ్ తప్పుడు డిక్లరేషన్లకు సంబంధించి 3ఎ, 3బి, 3సిలను చేర్చాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది.
వక్ఫ్ చట్టంలో మార్పులను సహించం
ముస్లిం సంస్థలు, ప్రతిపక్షాలు
వక్ఫ్ చట్టం సవరణకు కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు ఆమోదయోగ్యం కాదని ముస్లిం పర్సనల్ లా బోర్డు, పలు ముస్లిం సంస్థలు, ప్రతిపక్ష పార్టీలు పేర్కొన్నాయి. ముస్లిముల మతపరమైన, విద్యాపరమైన ధార్మిక కార్యక్రమాల నిమిత్తం ఇచ్చిన విరాళాలని, వాటిని నియంత్రించేందుకే ప్రభుత్వం వక్ఫ్ చట్టం రూపొందించిందని ముస్లిం పర్సనల్ లా బోర్డు పేర్కొంది. వక్ఫ్ చట్టానికి, వక్ఫ్ ఆస్తులకు భారత రాజ్యాంగం, షరియత్ అప్లికేషన్ చట్టం 1937 ప్రకారం రక్షణ ఉందని, కాబట్టి ఆస్తుల స్వభావాన్ని, స్థితిని మార్చే ఏ సవరణ చేసే హక్కు ప్రభుత్వానికి లేదని తెలిపింది. పార్లమెంటులో అలాంటి చర్యలను తిరస్కరించాలని ఎన్‌డిఎ పక్షాలు, ఇతర ప్రతిపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేసింది. వక్ఫ్ బోర్డు అధికారాలను హరించే కేంద్రప్రభుత్వ చర్యను తమ పార్టీ వ్యతిరేకిస్తుందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తెలిపారు. ఈ చర్య పార్లమెంటరీ విధానాలకు ముప్పు తెస్తుందని కాంగ్రెస్ నేత నసీమ్‌ఖాన్ పేర్కొన్నారు.
