- సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు
న్యూఢిల్లీ : రాజ్యాంగంలోని ఆర్టికల్ 39(బి) ప్రకారం అన్ని ప్రైవేటు ఆస్తులూ కమ్యూనిటీ భౌతిక వనరులు కావని, రాజ్యం వాటిని సమానంగా పంచాలని సుప్రీం కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. ఉమ్మడి ప్రయోజనాల కోసం పంపిణీ చేసేందుకు అన్ని రకాల ప్రయివేటు వనరులనూ స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి లేదని సుప్రీం తేల్చి చెప్పింది. ప్రయివేటు ఆస్తులపై ప్రభుత్వాలకు ఉన్న హక్కుల పరిధిని విపులీకరిస్తూ తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీం ధర్మాసనం 7:2 మెజారిటీతో తీర్పు వెలువరించింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ తీర్పును చదివి వినిపించారు. రాజ్యాంగంలోని 39 (బి) అధికరణ ప్రకారం ప్రైవేటు యాజమాన్యంలోని వనరులన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోజాలదని ఆయన తెలిపారు. దీనిపై గతంలో జస్టిస్ కృష్ణయ్యర్ బెంచ్ ఇచ్చిన తీర్పును విస్తృత ధర్మాసనం తోసిపుచ్చింది. ఆ తీర్పు నిర్దిష్ట భావజాలానికి లోబడిందని వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 39 (బి) ప్రకారం ప్రయివేటు ఆస్తులను సమాజ వనరులుగా పరిగణించవచ్చునా? వాటిని పంపిణీ చేసేందుకు ప్రభుత్వాధికారులు స్వాధీనం చేసుకోవచ్చా? అనే న్యాయపరమైన సందేహాలపై చంద్రచూడ్ సహా ఏడుగురు న్యాయమూర్తులు ఏకాభిప్రాయంతో తీర్పు వెలువరించారు. ఉమ్మడి ప్రయోజనాల కోసం అన్ని రకాల ప్రైవేటు ఆస్తులను ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవచ్చునంటూ గతంలో వెలువడిన తీర్పులను వారు తోసిపుచ్చారు. భౌతిక అవసరాల పేరిట ఒక వ్యక్తికి చెందిన ప్రయివేటు వనరులను కమ్యూనిటీ మెటీరియల్ రిసోర్స్‌గా పరిగణించరాదని, వనరుల స్వభావం, వాటి లక్షణాలు, సమాజానికి ఏ మేరకు ఉపయోగపడతాయి, వనరుల కొరత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.
ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలో న్యాయమూర్తులు హృషీకేశ్ రాయ్, బివి నాగరత్న, సుధాన్షు ధూలియా, జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రా, రాజేష్ బిందాల్, సతీష్ చంద్ర శర్మ, అగస్టీన్ జార్జ్ మసిహ్ తో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పు ఇచ్చింది. ‘1960, 1970 దశకాలలో సోషలిస్ట్ సంస్కరణలు, విధానాల వైపు పయనం సాగింది. సరళీకరణ కాలంలో మార్కెట్ ఆధారిత సంస్కరణలు చేపట్టారు. అయితే ఈ రోజు ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వ పెట్టుబడుల నుండి ప్రభుత్వ, ప్రయివేటు పెట్టుబడుల వైపు మళ్లింది. ఈ రెండూ సహజీవనం చేస్తున్నాయి’ అని చంద్రచూడ్ చెప్పారు. రాజ్యాంగాన్ని రచించిన వారు భవిష్యత్ ప్రభుత్వాల సామాజిక నిర్మాణం, ఆర్థిక విధానాల కోసం నిర్దిష్ట రూపం ఏదీ ఇవ్వలేదని ఆయన తెలిపారు. కాగా మెజారిటీ తీర్పుతో జస్టిస్ నాగరత్న, జస్టిస్ ధూలియా విభేదించారు.
జస్టిస్ కృష్ణయ్యర్‌పై విమర్శలు సరికాదు : జస్టిస్ నాగరత్న, జస్టిస్ ధూలియా అభ్యంతరం
ప్రైవేటు ఆస్తులన్నీ సమాజ వనరులు కాబోవంటూ సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం మెజారిటీ తీర్పు ఇచ్చిన సందర్భంగా జస్టిస్ వి.ఆర్.కృష్ణయ్యర్ గురించి ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఆ బెంచ్‌కు చెందిన ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ బి.నాగరత్న, జస్టిస్ సుధాంసు ధూలియా అభ్యంతరం వ్యక్తం చేశారు.
జస్టిస్ అయ్యర్ సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి. ఆయన మానవతావాదం, క్రిమినల్ జస్టిస్‌లో సంస్కరణలు గమనిస్తే ఆయనొక లెజెండ్ అని స్పష్టమవుతుంది. ‘బెయిల్ అనేది ఒక రూల్, జైలు అనేది మినహాయింపు’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్య ఇప్పటికీ సుప్రీం కోర్టు తీర్పుల సందర్భంగా విరివిగా ఉపయోగిస్తూ వుంటారు.
”కృష్ణయ్యర్ సిద్ధాంతం రాజ్యాంగం యొక్క స్థూలమైన, వెసులుబాటుతో కూడిన స్ఫూర్తికి అపచారం చేస్తోంది.” అని ప్రతిపాదిత తీర్పు సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యల గురించి జస్టిస్ నాగరత్న, జస్టిస్ సుధాంశు ధూలియా విడివిడిగా తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. తొమ్మిది మంది సభ్యులు గల రాజ్యాంగ ధర్మాసనం ప్రకటించిన తీర్పులో, సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌లో ఈ ‘డిస్ సర్వీస్ (అపచారం)’ వ్యాఖ్య లేదు. అయితే, చీఫ్ జస్టిస్ రూపొందించిన, ప్రచురితమైన తీర్పులో కృష్ణయ్యర్ సిద్ధాంతాన్ని ప్రస్తావించారు. ఆర్థిక, సామాజిక విధాన ప్రాధాన్యతను వివరించడానికి సంబంధించి ఈ ప్రస్తావన వచ్చింది. కోర్టులు ఆర్థిక విధాన డొమైన్‌లోకి ప్రవేశించరాదని చీఫ్ జస్టిస్ తన తుది అభిప్రాయంలో పేర్కొన్నారు.
సాధారణంగా ముసాయిదా అభిప్రాయాలన్నీ బెంచ్ సభ్యుల్లోనే చెలామణి అవుతూ వుంటాయి. కానీ ప్రతిపాదిత తీర్పు నుండి న్యాయమూర్తులు ఉటంకించడమనేది చాలా అరుదుగా జరుగుతూ వుంటుంది. భావితరాల న్యాయమూర్తులు తమ కాలానికి అనుగుణమైన దృష్టిని కోల్పోరాదని జస్టిస్ నాగరత్న అభిప్రాయపడ్డారు. జస్టిస్ కృష్ణయ్యర్ వంటి న్యాయమూర్తులు తమ కాలంలో అప్పటి ప్రభుత్వాలు అనుసరించిన సామాజిక, ఆర్థిక విధానాలను అనుసరించి తమ విధులను నిర్వర్తించారని పేర్కొన్నారు.
బెంచ్ ఇచ్చిన తీర్పుకు అసమ్మతి తెలిపిన న్యాయమూర్తి జస్టిస్ ధూలియా ప్రతిపాదిత తీర్పులో కృష్ణయ్యర్ గురించి చేసిన విమర్శను నివారించి వుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. బలమైన మానవతా విలువలు, సిద్ధాంతాలు, సమానత్వం, పారదర్శకత ప్రాతిపదికన కృష్ణయ్యర్ సిద్ధాంతం వుంది. క్లిష్టమైన సమయాల్లో మా బాటను ప్రకాశవంతం చేసే సిద్ధాంతం అది అని ఆయన పేర్కొన్నారు. కేవలం వారి మేధస్సుతోనే కృష్ణయ్యర్ వంటి మహానుభావులు ప్రముఖులు కాలేదని, ప్రజల పట్ల వారికి గల సహానుభూతే వారిని అంతటివారిని చేసిందని వ్యాఖ్యానించారు. వారి న్యాయ సిద్ధాంతాల్లో మానవుడే కీలకమని పేర్కొన్నారు.