- వయనాడ్‌కు తక్షణ సాయం కూడా ప్రకటించని మోడీ
- జాతీయ విపత్తు ఊసే లేదు
- పునరావాసం కోసం రు.2వేల కోట్ల సాయం కోరిన కేరళ ప్రభుత్వం
- ‘అండగా ఉంటాం’ అంటూ దాటవేత
తిరువనంతపురం : ప్రకృతి ప్రకోపానికి గురైన కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ శనివారం జరిపిన పర్యటన ఆ రాష్ట్ర ప్రజలకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఆప్పులతో పాటు, సర్వస్వాన్ని కోల్పోయి దిక్కుతోచక విలవిలలాడుతున్న బాధితులకు ప్రధానమంత్రి ఆండగా ఉంటారని, తిరిగి అభివృద్ధి చేసుకోవడానికి ఉదారంగా నిధులు ప్రకటిస్తారన్న ఆశలపై ప్రధాని నీళ్లు చల్లారు. మృత్యుసీమగా మారిన ఆ ప్రాంతాన్ని కళ్లారా చూసి, బాధితులతో స్వయంగా మాట్లాడిన, అధికారులతో సుదీర్ఘంగా సమావేశమై వివరాలు సేకరించిన ప్రధాన మంత్రి తాత్కాలిక సహాయాన్ని సైతం ప్రకటించలేదు. ‘ ఇది సాధారణ విపత్తు కాదు. కేంద్రం సాయం చేస్తుంది. అండగా ఉంటుంది.’ అన్న సాధారణ ఓదార్పు మాటలకే ఆయన పరిమితమయ్యారు. పునరావాసం కోసం రెండు వేల కోట్ల రూపాయలను సాయంగా విడుదల చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై ఢిల్లీ వెళ్లిన తరువాతైనా ఏమైనా స్పందిస్తారా… అన్నది వేచిచూడాల్సిఉంది. భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో మోడీ ఉదయం 11గంటల సమయంలో కన్నూర్ చేరుకున్నారు. కన్నూర్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహ్మద్, కేంద్ర మంత్రి సురేష్ గోపి ప్రభృతులు ప్రధానికి స్వాగతం పలికారు. ఆ తరువాత హెలికాఫ్టర్‌లో కొండచరియలు కూలిపడిన వయనాడ్‌లో ఏరియల్ సర్వే చేశారు. ఉదయం 11.10 గంటల నుండి మధ్యాహ్నాం 12.10 గంటల వరకు ఈ సర్వే సాగింది. అనంతరం 12.15 గంటలకు వయానడ్‌లోని విపత్తు ప్రాంతంలో పర్యటించారు. సైన్యం నిర్మించిన 190 అడుగుల బెయిలీ బ్రిడ్జిని పైనుండి మోడీ నడుచుకుంటూ వెళ్లి ఆ ప్రాంతంలో పర్యటించారు. చూర్మాలాలాకు చేరిన తర్వాత అక్కడి సహాయక సిబ్బందితో మాట్లాడారు అనంతరం డాక్టర్ మూపెన్ మెడికల్ కాలేజీని సందర్శించారు. అక్కడ చికిత్స పొందున్న రోగులను పరామర్శించారు. పరిస్థితి తీవ్రతను అంచనా వేసేందుకు కాల్‌పేట్‌లో వయనాడ్ కలెక్టరేట్ వద్ద సమీక్షా సమావేశంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సమావేశంలో సాయం కోసం 2 వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కొండచరియలు కూలిన ప్రాంతాల్లో సమగ్ర పునర్నిర్మాణం అవసరమని ముఖ్యమంత్రి విజయన్ చెప్పారని పబ్లిక్ వర్క్స్ మంత్రి మహ్మద్ రియాజ్ విలేకర్లకు చెప్పారు. ఈ ప్రాంతంలో రు.1200కోట్ల మేర నష్టం జరిగిందని రెవిన్యూ మంత్రి కె.రాజన్ చెప్పారు. కేవలం పునరావాస కార్యకలాపాల కోసమే రూ2వేల కోట్ల సాయం కోరినట్లు చెప్పారు.
వాతావరణ మార్పులు ఎదుర్కోవడానికి సాయం చేయండి : విజయన్ విజ్ఞప్తి
వాతావరణ మార్పులు కారణంగా కేరళ తీవ్రంగా నష్టపోతోందని, వాటిని ఎదుర్కోవడానికి సాయం చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధానమంత్రిని కోరారు. ఈ మేరకు వినతి పత్రాన్ని ఆయన మోడీకి అందచేశారు. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులు ప్రభావం కేరళను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని ఈ వినతిపత్రంలో పేర్కొన్నారు. తరుచుగా అతి భారీ వర్ఫాలు, అనూహ్య వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి వైపరీత్యాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, భారత వాతావరణ కేంద్రం, జాతీయ భూకంప కేంద్రం, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్‌మేషన్ సర్వీసెస్ వంటి సంస్థల ప్రాంతీయ కేంద్రాలను, ఆధునిక సాంకేతికతో రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరారు. విపత్తు జరిగిన తీరును, నష్టానికి సంబంధించిన ప్రాధమిక వివరాలను నోట్‌రూపంలో ప్రధానికి విజయన్ అందచేశారు. పూర్తిస్థాయి వివరాలతో సవివరమైన వినతిపత్రాన్ని తర్వాత కేంద్రానికి అందచేస్తామని పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరారు. కొట్టాయం ఇన్‌స్టిట్యూట్ ఆప్ క్లైమేట్ ఛేంజ్ స్టడీస్ సెంటర్‌కు, కేరళ క్లైమేట్ ఛేంజ్ అడాప్టేషన్ మిషన్‌ను ఉదారంగా నిధులు సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు.