ఎన్‌ఆర్‌సి తుది ముసాయిదాను బహిరంగపర్చాలి

  • సిఎఎ వ్యతిరేక కమిటీ డిమాండ్‌

గౌహతి : అస్సాంలో జాతీయ పౌరుల పట్టిక (ఎన్‌ఆర్‌సి) ఫైనల్‌ డ్రాఫ్ట్‌ను బహిరంగపర్చాలని సిఎఎ వ్యతిరేక కమిటీ డిమాండ్‌ చేసింది. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)కు వ్యతిరేకంగా శనివారం గౌహతిలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. కాగా, అస్సాంలో ఎన్‌ఆర్‌సి ఫైనల్‌ డ్రాఫ్ట్‌ను బహిరంగపర్చాలని రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌జిఐ)కు గతవారంలోనే సిఎఎ వ్యతిరేక కమిటీ లేఖ రాసింది.
పౌరసత్వ చట్టం 1955లోని సెక్షన్‌ 6ఎ యొక్క రాజ్యాంగ చెల్లుబాటును సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత అప్‌డేట్‌ చేసిన ఎన్‌ఆర్‌సిను బహిరంగపర్చకుండా దాచిఉంచడం అవసరం లేదని లేఖలో కమిటీ స్పష్టం చేసింది. అస్సాంలో ఎన్‌ఆర్‌సిను అప్‌డేట్‌ చేయడానికి దాదాపు రూ.1,602 కోట్లను ఖర్చు చేశారని గుర్తు చేసింది. 1971 మార్చి 25 అనే కటాఫ్‌ తేదీ ఆధారంగా అప్‌డేట్‌ చేసిన ఎన్‌ఆర్‌సిను 2019 ఆగస్టు 31 ఆర్‌జిఐకు సమర్పించినా, దురదృష్టవశాత్తూ ఇంకా బహిరంగ పర్చలేదని కమిటీ తన లేఖలో పేర్కొంది. ఆర్‌జిఐకి ఈ లేఖను కమిటీ చైర్మన్‌ హిరెన్‌ గోహైన్‌, చీఫ్‌ కోఆర్డినేటర్‌ దేబెన్‌ తమూలీ పేరుతో రాసారు.

➡️