ఈ  ‘వ్యవస్థ’తో కొందరికే ప్రయోజనం : రాహుల్‌ గాంధీ

Feb 13,2024 17:35 #Rahul Gandhi

న్యూఢిల్లీ :   దేశంలోని ‘వ్యవస్థ’తో కొంతమంది మాత్రమే ప్రయోజనం పొందుతున్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కేంద్రంపై ధ్వజమెత్తారు. మిగిలిన వారంతా పన్నులు చెల్లిస్తూ, ఆకలితో చనిపోతున్నారని అన్నారు. ఏవిషయాన్నైనా వ్యతిరేకిస్తూ గొంతెత్తితే.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి), సిబిఐ, ఐటి శాఖ దాడులను ఎదుర్కోవల్సిందేనని అన్నారు. తన భారత్‌ జోడో న్యారు యాత్రలో భాగంగా మంగళవారం ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాలోని ఉదయపూర్‌ ప్రాంతంలో రాహుల్‌ మాట్లాడారు.  దేశంలో 24 గంటలూ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే హింస, విద్వేషాలు వ్యాపిస్తున్నాయని   అన్నారు.  ప్రజలు  గ్రహించలేకపోతే , దోపిడీ  నిరంతరం ఓ ప్రక్రియలా జరుగుతూనే  ఉంటుందని అన్నారు.

”మీరు ప్రతిరోజూ దేశ నిధి నుండి ఎంత నగదు పొందుతున్నారు అని రోజులు మూడుసార్లు మీకు (ప్రజలు) మీరే ప్రశ్న వేసుకోవాలి. రోజంతా పోరాటం, ప్రయత్నం తర్వాత ఎంత రాబడిపొందుతున్నారో తెలుసుకోండి. పదిరోజుల తర్వాత మిమ్మల్ని ఒక వ్యవస్థ నిర్వీర్యం చేస్తోందని, దానికి సూత్రధారుడిగా ప్రధాని మోడీ ఉన్నారని మీకు తెలుస్తుంది” అని అన్నారు. వ్యవస్థ ప్రజలను ఎలా దోచుకుంటుందో ఓ చిన్న ఉదాహరణతో వివరించారు.

”  ఓ వ్యక్తి మార్కెట్‌కు వెళ్లినపుడు.. ముగ్గురు దొంగలు అతని వాలెట్‌ను దోచుకోవాలనుకున్నారు. మొదటి దొంగ ఆ వ్యక్తి దృష్టి మరలుస్తాడు. ఇదే విధంగా వ్యవస్థ మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తోంది. అదే సమయంలో రెండో దొంగ మీ వాలెట్‌ దొంగిలిస్తాడు. జిఎస్‌టి, నోట్లరద్దు రెండూ దోచుకోవడమే. నువ్వు తిరిగి ప్రశ్నిస్తే..మూడో దొంగ నిన్ను రెండు సార్లు కొడతాడు. ఒకవేళ నువ్వు దుకాణదారుడివిగా ఉండి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తే.. ఇడి, సిబిఐ, ఐటి దాడులతో బెదిరింపులు వస్తాయి ” అని అన్నారు.

➡️