- తక్షణమే రద్దు చేయాలి : ఇండియా బ్లాక్
న్యూఢిల్లీ : డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ (డిపిడిపి)లోని సెక్షన్ 44(3) సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) ని నాశనం చేస్తుందని ప్రతిపక్ష ఇండియా బ్లాక్ విమర్శించింది. తక్షణమే దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఇక్కడ గురువారం జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేత గౌరవ్ గగోరు, జాన్ బ్రిట్టాస్ (సిపిఎం), ఎంఎం అబ్దుల్లా (డిఎంకె), ప్రియాంక చతుర్వేది (శివసేన-యుబిటి), జావేద్ అలీ ఖాన్ (ఎస్‌పి), నావల్ కిషోర్(ఆర్‌జెడి) పాల్గొన్నారు. ఈ సమావేశంలో గగోరు మాట్లాడుతూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సహా ఇండియా బ్లాక్ పార్టీలకు చెందిన 120మందికి పైగా ఎంపీలు ఈ సెక్షన్‌ను రద్దు చేయాలని కోరుతూ సంయుక్త మెమొరాండంపై సంతకాలు చేశారన్నారు. ఐటి మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఈ మెమొరాండాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. సెక్షన్ 44(3)ని ఆర్‌టిఐ చట్టం, 2005లోని సెక్షన్ 8(1)(జె)కి ప్రత్యామ్నాయంగా మార్చడానికి ప్రయత్నిస్తోందని గగోరు తెలిపారు. వ్యక్తిగత సమాచారమేదైనా దాన్ని వెల్లడించడం ప్రజా కార్యకలాపాలకు గానీ లేదా ప్రజా ప్రయోజనాలకు గానీ సంబంధం లేదని భావించినా, లేదా గోప్యతపై అనవసరపు దాడి చేస్తుందని భావించినా సదరు సమాచారాన్ని నిలిపివేయడానికి ఆర్‌టిఐ చట్టంలోని సెక్షన్ 8(1)(జె) అనుమతిస్తుంది. ఈ ఆంక్ష లేదా పరిమితి విధించడమనేది ఒక ముఖ్యమైన అంశానికి లోబడి వుంటుంది. ఇలా వెల్లడించిన సమాచారానికి విస్తృత ప్రజా ప్రయోజనాలు వున్నాయని కేంద్ర పౌర సమాచార అధికారి, రాష్ట్ర పౌర సమాచార అధికారి లేదా అప్పిలేట్ అధారిటీ నిర్ణయించినట్లైతే దీన్ని అందుబాటులో వుంచుతారు. డిపిడిపి చట్టంలోని సెక్షన్ 44(3), ఆర్‌టిఐ చట్టంలోని సెక్షన్ 8(1)(జె)ని సవరిస్తుంది. ఇది, ప్రజా ప్రయోజనాలు లేదా మరే ఇతర అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండానే ప్రభుత్వ సంస్థలు వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన సమాచారాన్ని దాచడానికి అనుమతిస్తుంది. డిపిడిపి చట్టంలోని సెక్షన్ 44(3)ని పౌర హక్కుల కార్యకర్తలు సహా పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు.