onion price : ఉల్లిధరకు వ్యతిరేకంగా ప్రతిపక్షనేతల ఆందోళన

Aug 8,2024 14:37 #onions, #Opposition protests, #price

న్యూఢిల్లీ : దేశంలో ఉల్లిధరలు పెరిగిపోయాయి. ఉల్లితోపాటు ఇతర కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్యులు కొనుక్కోలేని పరిస్థితి ఏర్పడింది. ధరలకు వ్యతిరేకంగా వివిధ పార్టీలకు చెందిన ప్రతిపక్ష ఎంపీలు గురువారం పార్లమెంటు వెలుపల నిరసన చేపట్టారు. ఉల్లిపాయల దండలు మెడలో వేసుకుని.. కేంద్ర ప్రభుత్వం ఉల్లిధర తగ్గించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్‌జెడి ఎంపి మనోజ్‌ ఝా మాట్లాడుతూ..’ప్రభుత్వం మద్దతు ధరపై చట్టపరమైన హామీ ఇవ్వడం చాలా పెద్ద సమస్య. మరోవైపు పార్లమెంటులో క్రీడాకారుల(అథ్లెట్లు)పై చేసిన ఖర్చుల లెక్కలు చెప్పేటప్పుడు మాత్రం ప్రభుత్వం సిగ్గుపడదు. కానీ ప్రధానమంత్రి, క్యాబినెట్‌ మంత్రుల కోసం పన్ను చెల్లింపుదారుల డబ్బు ఎంత ఖర్చవుతుందో ప్రభుత్వం వివరించాలి’ అని ఆయన అన్నారు.
శివసేన (యుబిటి) ఎంపి ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ.. ‘రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ వారి ఆదాయం సంగతి పక్కనబెడితే.. వారు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మహారాష్ట్రలో ఉల్లి రైతులు తమ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి అనుమతించకుండా… గుజరాత్‌ రైతులకు అనుమతిస్తారు. అందుకే మేము నిరసన తెలుపుతున్నాం’ అన్నారు.

➡️