వక్ఫ్‌ జెపిసి ఛైర్మన్‌ను మార్చాలి

  • ప్రతిపక్ష ఎంపీల డిమాండ్‌
  • జెపిసి సమావేశం నుంచి వాకౌట్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : వక్ఫ్‌ సవరణ బిల్లును పరిగణనలోకి తీసుకున్న సంయుక్త పార్లమెంటరీ సంఘం (జెపిసి) ఛైర్మన్‌ జగదాంబిక పాల్‌ను మార్చాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. జెపిసి నిబంధనలను పాటించాల్సిన చైర్మనే వాటిని అతిక్రమిస్తే ఇక ఆ కమిటీకి విలువేముంటుందంటూ ప్రతిపక్ష ఎంపిలు సోమవారం జెపిసి సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు. బిజెపి సీనియర్‌ ఎంపి జగదాంబికా పాల్‌ను జెపిసి ఛైర్మన్‌ పదవి నుంచి తప్పించాలనికోరుతూ ప్రతిపక్ష సభ్యులు లోక్‌సభ స్పీకరు ఓం బిర్లాను త్వరలో కలవనున్నారు. వివాదాస్పద కర్ణాటక భూ ఒప్పందంలో కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లికార్జున్‌ ఖర్గేను ఉద్దేశించి కర్ణాటక రాష్ట్ర మైనారిటీ కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ అన్వర్‌ మణిపాడి చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్‌ భూమిని ఆక్రమించుకున్నారంటూ ఖర్గేపై మణిపాడి ఆరోపించారు. ఆయన కమిటీ ముందు 11 పేజీల ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. సీనియర్‌ నేతను, కర్ణాటక ప్రభుత్వాన్ని అవమానించేలా ఛైర్మన్‌ ఆయనకు అవకాశం ఇవ్వడాన్ని ప్రతిపక్ష సభ్యులు ఆక్షేపించారు. మణిపాడి వ్యాఖ్యలు అసంబద్ధమూ, అనుచితమూనని శివసేన (ఉద్దవ్‌ ఠాక్రే) ఎంపి అరవింద్‌ సావంత్‌ విమర్శించారు. ఖర్గేపై వ్యక్తిగత ఆరోపణలకు అనుమతి ఇవ్వడం ద్వారా పార్లమెంటరీ నిబంధనలను ఉల్లంఘించారని ధ్వజమెత్తారు. సమావేశం నుంచి వాకౌట్‌ చేసిన వారిలో కాంగ్రెస్‌ ఎంపిలు గౌరవ్‌ గొగోరు, ఇమ్రాన్‌ మసూద్‌, డిఎంకెకు చెందిన ఎ రాజా, ఎఐఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసి, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మొహిబుల్లా, ఆప్‌కు చెందిన సంజరు సింగ్‌ తదితరులు ఉన్నారు. ప్రతిపక్ష సభ్యుల వాకౌట్‌ మధ్య జగదాంబిక పాల్‌ సమావేశాన్ని కొనసాగించారు. సోమవారం జెపిసి సమావేశంలో జమాతే ఉల్‌ ఉలేమా ఇ హింద్‌ ప్రతినిధులు హాజరై తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

➡️