ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) సమావేశం నుంచి ప్రతిపక్ష ఎంపిలు వాకౌట్ చేశారు. జెపిసి ఛైర్మన్, బిజెపి ఎంపి జగదాంబిక పాల్ అధ్యక్షతన సోమవారం పార్లమెంటులో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై జెపిసి సమావేశం జరిగింది. ఢిల్లీ వక్ఫ్ బోర్డు సమర్పించిన ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఎంపిలు ఆ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఢిల్లీ ప్రభుత్వ అనుమతి లేకుండానే.. ఢిల్లీ వక్ఫ్ బోర్డు అడ్మినిస్ట్రేటర్ మీటింగ్‌లో ప్రెజెంటేషన్ ఇచ్చినట్లు ప్రతిపక్ష సభ్యులు విమర్శించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపి సంజరు సింగ్, డిఎంకె ఎంపి మహమ్మద్ అబ్దుల్లా, కాంగ్రెస్ ఎంపిలు నసీర్ హుస్సేన్, మహమ్మద్ జావెద్, ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఒవైసి సమావేశం నుంచి వాకౌట్ చేసి తమ నిరసన తెలిపారు. అనంతరం కొంత సమయం తరువాత ఎంపిలు తిరిగి సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అనుమతి లేకుండానే వక్ఫ్ బోర్డు ప్రాథమిక నివేదికను పూర్తిగా మార్చేశారని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసిడి) కమిషన్, ఢిల్లీ వక్ఫ్ బోర్డు అడ్మినిస్ట్రేటర్ అశ్విని కుమార్‌పై ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ఈ సమావేశానికి టిఎంసి ఎంపి కళ్యాణ్ బెనర్జీ గైర్హాజరుతో గందరగోళం నెలకొంది. మరోవైపు వక్ఫ్ బిల్లుకు ప్రతిపాదించిన సవరణను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి సోమవారం జెపిసికి లేఖ రాశారు. బిల్లుపై జెపిసి ఢిల్లీ ప్రభుత్వం నుంచి స్పందన కోరింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, అతిషి ఈ బిల్లును ‘అనవసరం, వ్యర్థం’ అని పేర్కొన్నారు.
గత మంగళవారం (అక్టోబరు 22) జరిగిన జెపిసి సమావేశంలో టిఎంసి ఎంపి కళ్యాణ్ బెనర్జీ అన్‌పార్లమెంటరీ ప్రవర్తన ఆరోపణలపై ఒకరోజు సస్పెండ్ అయ్యారు. ఆ ఘటనలో అద్దాలు పగిలి కళ్యాణ్ బెనర్జీ చేతికి గాయమైంది. కేంద్ర మైనారిటీశాఖ మంత్రి కిరన్ రిజిజు ఆగస్టు 8న లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లును తీవ్ర వ్యతిరేకత, గందరగోళం మధ్య ప్రవేశపెట్టారు. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, ముస్లిముల మత స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తోందని పేర్కొంటూ ప్రతిపక్షాలు బిల్లుపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. సుదీర్ఘ చర్చ అనంతరం ఏకాభిప్రాయం కోసం బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి)కి పంపాలని కేంద్రం నిర్ణయించింది.