Opposition : ఈ వ్యాఖ్యలు ప్రధాని మోడీకి తగవు

న్యూఢిల్లీ :  ముస్లింలు పంక్చర్లను మరమ్మతు సరిచేస్తారన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఇటువంటి వ్యాఖ్యలు ప్రధాని పదవిలో ఉన్న మోడీకి తగదని మంగళవారం కాంగ్రెస్‌ విమర్శించింది. సోషల్‌మీడియాలో ముస్లింలను ట్రోల్‌ చేసేందుకు ఆ వ్యాఖ్యలు వినియోగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగాలు కల్పించకుండా మోడీ ప్రభుత్వం దేశ యువతను ఈ దుస్థితికి తీసుకువచ్చిందని కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపి ఇమ్రాన్‌ ప్రతాప్‌ఘర్హి విమర్శించారు. ఉద్యోగాలు లేనపుడు పంక్చర్లు మరమ్మతు చేయడం లేదా వడలు విక్రయించడం వంటి వాటినే ఎంపిక చేసుకుంటారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ను ముస్లింల సానుభూతిపరులు అంటున్నారు. మీరు వారిని ద్వేషిస్తున్నారా అని ప్రశ్నించారు. ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, షానవాజ్‌ హుస్సేన్‌, ఎంజె అక్బర్‌, జాఫర్‌ ఇస్లాంలను ఎందుకు పక్కకు పడేశారని నిలదీశారు.వక్ఫ్‌ బిల్లుతో మంచి జరుగుతుందని అంటున్నారు కానీ లోక్‌సభలో ఆ బిల్లుని ముస్లిం ఎంపిలు ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు. ముస్లిం మహిళల హక్కుల గురించి మాట్లాడుతున్నారు.. లోక్‌సభలో లేదా రాజ్యసభలో లేదా ఏ రాష్ట్ర అసెంబ్లీలోనైనా ఒక్క ముస్లిం మహిళా సభ్యురాలైనా ఉన్నారా అని ప్రతాప్‌ఘర్హి నిలదీశారు.
ఎఐఎంఐఎం అధ్యక్షులు, హైదరాబాద్‌ ఎంపి అసదుద్దీన్‌ ఒవైసీ ప్రధాని మోడీ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ఆర్‌ఎస్‌ఎస్‌ తన భావజాలాన్ని, వనరులను దేశ ప్రయోజనాల కోసం వినియోగించి వుంటే ప్రధాని మోడీ బాల్యంలో టీ అమ్మాల్సిన అవసరం ఉండేది కాదని అన్నారు. మోడీ అధికారంలో ఉన్న 11 ఏళ్లలో పేద హిందువులకు, ముస్లింలకు ఏం ప్రయోజనాలు కల్పించారని అన్నారు. వక్ఫ్‌ చట్టాలు బలహీనంగా ఉండటంతోనే వక్ఫ్‌ ఆస్తులు దుర్వినియోగమయ్యాయని, మోడీ ప్రవేశపెట్టిన సవరణలు ఆ చట్టాలను మరింత బలహీనపరుస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.  బిజెపి ముస్లింలకు ఎందుకు టిక్కెట్లు   ఇవ్వదని సమాజ్‌వాది పార్టీ నేత అబూ అజ్మీ ప్రశ్నించారు.
వక్ఫ్‌ ఆస్తులను నిజాయితీగా ఉపయోగించినట్లైతే యువ ముస్లింలు జీవనోపాధి కోసం పంక్చర్లను మరమ్మతు చేయాల్సిన అవసరం ఉండదని ప్రధాని మోడీ సోమవారం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. హర్యానాలోని హిస్సార్‌ విమానాశ్రయ ప్రారంభోత్సవం సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

➡️