- రాజస్థాన్‌లో ఆందోళనలు
జైపూర్ : ఇటీవలి కాలంలో పశ్చిమ రాజస్థాన్‌లో చేపట్టిన పలు పునరుద్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. తాజాగా జైసాల్మర్‌లో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ చేపట్టిన 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్ట్ వివాదంలో చిక్కుకుంది. ఈ ప్రాజెక్ట్ కోసం అదానీ కంపెనీకి ప్రభుత్వ భూమిని ధారాదత్తం చేయడాన్ని వ్యతిరేకిస్తూ బయా గ్రామ ప్రజలు గత నెలలో ఓ తీర్మానాన్ని ఆమోదించారు. దానిని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విభాగాలకు పంపారు. ఈ ప్రాజెక్ట్ కోసం బుధవారం స్విచ్‌యార్డ్ ఏర్పాటుకు జరిగిన ప్రయత్నాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
కంపెనీ సేకరించిన ప్రైవేటు భూమిలో స్విచ్‌యార్డ్‌ను ఏర్పాటు చేయడం పట్ల స్థానికులు అభ్యంతరం తెలిపారు. ఆ స్థలం చుట్టూ ఉన్న ప్రభుత్వ భూమిని కూడా అదానీ కంపెనీకి కట్టబెడతారేమోనని వారు ఆందోళన వ్యక్తం చేశారు. స్విచ్‌యార్డ్ ఏర్పాటును అడ్డుకునేందుకు ప్రయత్నించిన 14 మంది స్థానికులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. స్థానికులతో కలిసి ఎమ్మెల్యే రవీంద్ర సింగ్ భాటీ ధర్నాకు దిగారు. ఆందోళనకారులను విడుదల చేసే వరకూ ధర్నాను విరమించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో పోలీసులు వారిని విడుదల చేశారు.
ఈ ప్రాంతంలోని వృక్ష జాతులను కాపాడుకునేందుకు తమ పూర్వీకులు సంవత్సరాల తరబడి జీవితాలను త్యాగం చేశారని, ఇప్పుడు ప్రైవేటు కంపెనీలు బయా గ్రామంలో బలవంతంగా పనులు మొదలు పెట్టాయని, ఆలయాల పరిసరాలలో ఉన్న చెట్లను నరికేస్తున్నాయని ఎమ్మెల్యే ఆరోపించారు. ప్రైవేటు స్థలం చుట్టూ ఉన్న ప్రభుత్వ భూమిని రక్షిత ప్రాంతంగా గుర్తించాలని స్థానికులు డిమాండ్ చేశారు. పర్యావరణాన్ని, తమ ఆలయాలను కాపాడుతున్న ప్రభుత్వ భూమిని అదానీకి కట్టబెట్టవద్దన్నది ప్రజల ప్రధాన డిమాండ్. ఆ ప్రభుత్వ భూమిలో పలు దేవాలయాలు ఉన్నాయి. అక్కడ పండుగల సందర్భంగా ఉత్సవాలు జరుగుతుంటాయి.
ప్రభుత్వం దీనిని రక్షిత ప్రాంతంగా గుర్తించి, రెవెన్యూ రికార్డులలో మార్పులు చేసే వరకూ ఆందోళన ఆపబోమని గ్రామస్థులు స్పష్టం చేశారు. ప్రభుత్వ భూమిని సౌర, పవన ప్రాజెక్టుల కోసం అప్పగిస్తే స్థానికులు జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస పోతారని జైసాల్మర్ ఎమ్మెల్యే చోటూ సింగ్ సెప్టెంబరులో శాసనసభలో ప్రస్తావించారు.