- మహిళా డాక్టర్‌తో సహా ఏడుగురి అరెస్టు
న్యూఢిల్లీ : దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్)లో సాగుతున్న అవయవ మార్పిడి రాకెట్ గుట్టును పోలీసులు చేధించారు. ఈ రాకెట్‌తో సంబంధమున్న ఏడుగురిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మంగళవారం వెల్లడించారు. అరెస్టు చేసిన వారిలో ఢిల్లీకి చెందిన మహిళా డాక్టర్, ముగ్గురు బంగ్లాదేశీయులు ఉన్నారని తెలిపారు. పక్కా సమాచారం మేరకు ఈ కేసును గత రెండు నెలలుగా ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ విచారణ చేస్తోంది. దాతలు, గ్రహీతల్లో ఎక్కువ మందిని బంగ్లాదేశ్ నుంచి శస్త్రచికిత్సల కోసం నకిలీ పత్రాలతో భారత్‌కు తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆగేయ ఢిల్లీలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి సర్జన్‌గా పనిచేస్తున్న మహిళా డాక్టర్ 2021 నుంచి 2023 మధ్యలో బంగ్లాదేశ్‌కు చెందిన కొంతమందికి శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు పొలీసులు వెల్లడించారు. ఆమె విజిటింగ్ కన్సల్టెంట్‌గా ఉన్న నోయిడాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ శస్త్రచికిత్సలు జరిగాయని చెప్పారు. మహిళా డాక్టర్, ఆమె సహాయకుడు, ముగ్గురు బంగ్లాదేశీయులు, మరో నలుగుర్ని అరెస్టు చేసినట్లు చెప్పారు.