బిజెపిలో సంస్థాగత మార్పులు ?

Jun 12,2024 08:55 #BJP, #Organizational changes

కేంద్ర మంత్రి అయిన పార్టీ అధ్యక్షుడు నడ్డా
పదవీకాలం ముగిసిన ప్రధాన కార్యదర్శి సంతోష్‌
ఈ రెండు పదవుల భర్తీకి ప్రయత్నాలు
ఓడిన మంత్రులకూ పార్టీ పనులు
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బిజెపికి నిరుత్సాహాన్ని కలిగించాయి. ఆ పార్టీ 63 స్థానాలను కోల్పోయింది. ఈ నేపథ్యంలో సంస్థాగతంగా పార్టీలో భారీ మార్పులు చేపట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జెపి నడ్డాను కేంద్ర మంత్రిమండలిలోకి తీసుకోవడంతో ఆ పదవిని భర్తీ చేయాల్సి ఉంటుంది. పార్టీ వ్యవస్థలో అత్యంత శక్తివంతమైన మరో పదవి ప్రధాన కార్యదర్శి. పార్టీలో అధ్యక్షుడి తర్వాత రెండో స్థానం ప్రధాన కార్యదర్శిదే. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న బిఎల్‌ సంతోష్‌ తన రెండు సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. దీంతో అధ్యక్షుడితో పాటు ప్రధాన కార్యదర్శిని కూడా ఎంపిక చేయాల్సిన అవసరం ఏర్పడింది.
గతంతో బిజెపి అధ్యక్షులుగా వ్యవహరించిన రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా కూడా కేంద్ర క్యాబినెట్‌లో చేరారు. 2014లో నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత వారిద్దరూ పార్టీ పదవుల నుండి వచ్చి ప్రభుత్వంలో సీనియర్‌ మంత్రులుగా ఎదిగారు. 2019లో నడ్డా బిజెపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. 2020లో అమిత్‌ షా స్థానంలో పార్టీ అధ్యక్షుడయ్యారు. అప్పుడు అమిత్‌షా కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన నడ్డా మూడేళ్ల పదవీకాలం గత సంవత్సరం జనవరితోనే ముగిసినప్పటికీ లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని దానిని పొడిగించారు. కేంద్ర మంత్రిగా నియమితులైనప్పటికీ నడ్డా ఇప్పటి వరకూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయలేదు. మోడీ ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియన్‌ నేతలతో చర్చించి నడ్డా స్థానంలో వేరొకరిని అధ్యక్షుడిగా నియమిస్తారా? లేక ప్రస్తుతం వర్కింగ్‌ ప్రెసిడెంటును నియమించి, ఆ తర్వాత ఆయనను అధ్యక్షుడిని చేస్తారా అనేది చూడాల్సి ఉంది.
బిజెపి అధ్యక్ష పదవికి మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ పేర్లు వినిపించాయి. వారిని కూడా కేంద్ర క్యాబినెట్‌లో చేర్చుకున్నారు. అధ్యక్ష పదవికి పోటీ పడిన భూపేంద్ర యాదవ్‌, పీయుష్‌ గోయల్‌ కూడా మంత్రులయ్యారు. తాజాగా మహారాష్ట్రకు చెందిన వినోద్‌ తాడే పేరు విన్పిస్తోంది. బిజెపికి దళితులు, ఓబీసీలు దూరమైన నేపథ్యంలో వెనుకబడిన తరగతులకు చెందిన వ్యక్తికి పార్టీ అధ్యక్ష పదవిని అప్పగించే యోచన కూడా చేస్తున్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్‌, హర్యానా రాష్ట్రాల్లో జరగబోయే శాసనసభ ఎన్నికలు నూతన అధ్యక్షుడికి పరీక్షగా నిలవబోతున్నాయి.
లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం పాలైన 16 మంది కేంద్ర మంత్రులకు కూడా బిజెపి ఏదో ఒక బాధ్యత అప్పగించాల్సి ఉంటుంది. వారిలో కొందరికి పార్టీ పదవులు కట్టబెట్టవచ్చు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించినా మంత్రి పదవి కోల్పోయిన అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌కు సైతం పార్టీ పదవి లభించే అవకాశం ఉంది.

➡️