మాకొద్దీ క్రిమినల్‌ చట్టాలు

  • కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్ల డిమాండ్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : జులై ఒకటి నుంచి భారతీయ న్యాయ సంహిత పేరుతో అమలులోకి వచ్చిన మూడు కొత్త క్రిమినల్‌ చట్టాలు అత్యంత ప్రమాదకరంగా పరిణమించను న్నాయని, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర కార్మిక సంఘాల వేదిక (సిటియు), స్వతంత్ర ఫెడరేషన్లు డిమాండ్‌ చేశాయి. పాత చట్టాలు తిరిగి అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతూ పది కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్తంగా మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశాయి. సిఐటియు, ఎఐటియుసి, ఐఎన్‌టియుసి, హెచ్‌ఎంఎస్‌, ఎఐయుటియుసి, ఎఐసిసిటియు, యుటియుసి, ఎల్‌పిఎఫ్‌, టియుసిసి, ఎస్‌ఇడబ్ల్యుఎ నేతలు సంయుక్తంగా ప్రకటనపై సంతకం చేశారు. ఏవైనా మార్పులు ప్రతిపాదిస్తే, వాటిని ఆమోదించడానికి, అమలు చేయడానికి ముందే పబ్లిక్‌ డొమైన్‌లో చర్చించాలని ఆయా సంఘాలు కోరాయి. సరైన సంప్రదింపులు లేకుండా, పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన సూచనలను పట్టించుకోకుండా, బిల్లు ముసాయిదాను బహిరంగంగా అందుబాటులో ఉంచకుండా ఈ చట్టాలను ప్రజలపై బలవంతంగా రుద్దారని విమర్శించాయి. బ్రిటిష్‌ కాలం నాటి చట్టాల స్థానంలో వీటిని తీసుకొచ్చామని చెప్పి సమర్థించుకోవడం దారుణమని, ఎందుకంటే ఇందులో గత చట్టాల్లోని అన్ని నిబంధనలు ఉన్నాయని తెలిపాయి. వాటిలో కొన్నిటిని మరింత కఠినతరం చేశారని విమర్శించాయి. ఉదాహరణకు దేశద్రోహ చట్టం కింద శిక్షించేందుకు ఉద్దేశించిన ఐపిసిలోని సెక్షన్‌ 124 (ఒక సాధారణ బ్రిటీష్‌ రాజ్‌ చట్టం)ను సుప్రీం కోర్టు కొట్టేసినా, ఈ కొత్త చట్టంలో అలాగే ఉంచారు. మూడేళ్ల జైలు శిక్ష విధించే నిబంధనను ఏడేళ్లకు పెంచారని, అలాగే ప్రజలు, నాయకులు సమావేశాలు నిర్వహించుకుంటే ఎవరినైనా ఉగ్రవాదులుగా ప్రకటించవచ్చని, అన్ని కార్మిక సంఘాల కార్యకలాపాలను ఈ నిబంధన కిందకు తీసుకొస్తారని పేర్కొన్నాయి. వివిధ విభాగాలకు చెందిన అనేక నిబంధనలను మార్చారని, ఇది తీవ్ర గందరగోళానికి దారి తీస్తుందని తెలిపాయి. ఇది న్యాయ స్థానాల్లో కేసుల పెండింగ్‌కు దారితీస్తుందని, ఇప్పటికే దిగువ కోర్టుల్లో 6.4 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని విచారించడమే కష్టంగా ఉన్న నేపథ్యంలో ఈ చట్టాల వల్ల పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వివరించాయి.ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసే అన్ని అధికారాలు ఎస్‌హెచ్‌ఒలకు ఉన్నాయని, అంటే కేసు నమోదు చేయడం కూడా వారి విచక్షణాధికారంగా మారుతుందని విమర్శించాయి. ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయడం ప్రతి పౌరునికి ఉండే హక్కు అని, కానీ ఇప్పుడు అది ఎస్‌హెచ్‌ఒ విచక్షణకు వదిలేస్తున్నారని పేర్కొన్నాయి. పోలీసు కస్టడీ వ్యవధిని 15 రోజుల నుంచి 90 రోజులకు పెంచారని, తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా నిరసన తెలిపే నిరసనకారులు, ఘెరావ్‌ చేసే కార్మికులపై కేసు నమోదు చేయడానికి పోలీసులకు అధికారం ఉందని, ఇది పాలక యంత్రాంగం, దాని మార్గదర్శకుల ఆదేశాలకు అనుగుణంగా అణచివేతను ప్రదర్శించే పోలీస్‌ రాజ్‌ను తలపిస్తుందని పేర్కొన్నాయి. న్యాయ స్థానాలను వర్ణించడానికి ‘కోర్ట్‌ ఆఫ్‌ జస్టిస్‌’ అనే నిర్వచనమనే నిబంధనలలో ఉన్న పదం కూడా, ఇప్పుడు కేవలం ‘కోర్టు’గా మాత్రమే ఉంటుందని ఎద్దేవా చేశాయి.రవాణా రంగ కార్మికుల నుంచి వచ్చి ప్రతిఘ టనతో హిట్‌ అండ్‌ రన్‌ కేసులకు సంబంధించిన తీవ్రమైన నిబంధనలపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం, ఆ సెక్షన్లు అమల్జేయబోమని చెప్పిందని, కానీ ప్రభుత్వం వాటిని రద్దు చేయలేదని పేర్కొన్నాయి. ఈ చట్టాలను ఉచ్ఛరించడానికి హిందీ భాషను ప్రయోగించారని, అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 348, అధికార భాషల చట్టం ప్రకారం పార్లమెంటు, శాసన సభల అన్ని అంశాలు ఇంగ్లీష్‌లో ఉండాలనే ఆదేశాలున్నాయని తెలిపాయి. నోట్ల రద్దు మాదిరిగానే, ఈ చట్టాలు కూడా చాలా ప్రమాదకరమైనవని పేర్కొన్నాయి.

➡️