పాఠాలు నేర్పిన ఫలితాలు !

Jun 8,2024 01:22 #learned, #Lessons, #Results

ఓట్లు రాల్చని ‘హిందూత్వం’
ఆధ్యాత్మిక కేంద్రాల్లోనూ అపజయాలే
పార్టీలో రాజుకుంటున్న అసమ్మతి కుంపట్లు
మిత్రుల నుంచీ ఒత్తిళ్లు తప్పవా?
న్యూఢిల్లీ : లోక్‌సభలో బిజెపి అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ఆ పార్టీ దూకుడుకు అడ్డుకట్ట వేయడంలో ఇండియా వేదిక విజయం సాధించింది. ఈ క్రమంలో ఇండియా వేదిక అనేక అవరోధాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇద్దరు ముఖ్యమంత్రులను జైలుకు పంపారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్‌ బ్యాంక్‌ ఖాతాలను స్తంభింపజేశారు. ప్రభుత్వ యంత్రాంగం, ప్రధాన స్రవంతి మీడియా బిజెపి కుమ్మక్కైంది. ప్రతిపక్షాలకు నిధులు అందకుండా ఎక్కడికక్కడ అష్టదిగ్బంధం చేశారు. ఎన్నికల ప్రక్రియలో అన్ని పార్టీలకూ సమానావకాశాలు లభించి ఉంటే ఇండియా కూటమి కచ్చితంగా మ్యాజిక్‌ ఫిగర్‌ 272ని దాటేసి ఉండేది. కానీ అది అసాధ్యమైంది. అయినప్పటికీ ఇండియా వేదిక ఛైర్‌పర్సన్‌ మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో పాటు ప్రతి ఒక్క ప్రతిపక్ష నాయకుడూ ప్రజల హృదయాలను గెలుచుకున్నారు.
అసాధారణ రీతిలో వచ్చిన ఫలితాలను ప్రజా విజయంగా అందరూ భావించారు. అనేకమంది భారతీయులు దీనిని తమ వ్యక్తిగత విజయంగా తీసుకొని సంబరాలు చేసుకున్నారు. ఎందుకంటే వారు భారతీయ ఆత్మ కోసం జరిగిన చారిత్రక పోరాటంలో భాగస్వాములయ్యారు.

అంతర్గత తిరుగుబాట్లు అనివార్యం

బిజెపి ఓటమికి కారణాలు అనేకం. ఆ పార్టీలో సంస్థాగత సమస్యలు వేళ్లూనుకుపోయాయి. మోడీ పాలనలో బిజెపి సంస్థాగతంగా బలహీనపడింది. పైగా బిజెపి, సంఫ్‌ు పరివార్‌ మధ్య సంబంధాలు సజావుగా సాగలేదు. అధికార పంపిణీ, ఆధిపత్యం విషయంలో తీవ్రమైన విభేదాలు పొడసూపాయి. ప్రత్యామ్నాయ అధికార కేంద్రాలు ఏర్పడకుండా నరేంద్ర మోడీ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. విధేయత చూపని అభ్యర్థుల ఓటమికి చేయాల్సిందంతా చేశారు. అయితే వీరిలో చాలా మంది గెలుపొందడంతో రాబోయే ఐదు సంవత్సరాల్లో పార్టీలో అంతర్గతంగా తిరుగుబాటు చోటుచేసుకునే అవకాశం ఉంది.

ప్రతికూల పరిస్థితులు తప్పవు

ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. గతంలో దూరమైన పార్టీలే ఇప్పుడు బిజెపికి చేరువయ్యాయి. ఆయా పార్టీలతో సంబంధాలు కొనసాగించడం మోడీకి అసౌకర్యంగానే ఉంటుంది. పైగా గతంలో తమకు ఎదురైన చేదు అనుభవాలను తెలుగుదేశం, జేడీయూ వంటి పార్టీలు ఎన్నటికీ మరచిపోలేవు. ఇప్పుడు తమకు అవకాశం రావడంతో ఆయా పార్టీలు తమ డిమాండ్ల చిట్టాను మోడీ ముందు ఉంచి వాటిని నెరవేర్చాల్సిందిగా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. పులి మీద పుట్రలా కొన్ని మత సంస్థలు కూడా ఇప్పుడు ధిక్కార స్వరాన్ని విన్పిస్తున్నాయి. అయోధ్య ట్రస్ట్‌ తమను పట్టించుకోలేదని, కించపరిచాయని ఆ సంస్థలు గుర్రుగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ గత వైభవాన్ని, ప్రాభవాన్ని కనబరచడం అసాధ్యం. ఆయన తీవ్రమైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

దూకుడు తప్పదు

బిజెపిని ఈ పరిణామాలను ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మలచుకోవాల్సి ఉంటుంది. గత ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఏ విధంగా అయితే దూకుడుగా వ్యవహరించి బిజెపి సైద్ధాంతిక అజెండాను ఎందగట్టారో ఇండియా వేదికలో ఇతర పార్టీల నేతలు కూడా ఇకపై అదే విధమైన వైఖరిని ప్రదర్శించాలి. తనపై బిజెపి నాయకత్వం ఎంతగా ద్వేషపూరిత ప్రచారం చేసినప్పటికీ రాహుల్‌ చెక్కుచెదరక మొక్కవోని ధైర్యంతో ముందుకు నడిచారు. ప్రభుత్వ సామాజిక, ఆర్థిక విధానాలను తూర్పార పట్టారు. ఎన్నికల బాండ్ల పథకంలో చోటుచేసుకున్న కుంభకోణాన్ని ప్రజలకు వివరించడంలో సఫలీకృతులయ్యారు.

ఇది తొలి అడుగే

ఇటీవలి కాలంలో పలు ప్రగతిశీల శక్తులు భారత రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు తమ వంతు కృషి చేశాయి. సినీ నిర్మాతలు, రచయితలు, కవులు, వివిధ సంఘాలు, వ్యాపారులు, యూట్యూబర్లు ఈ మహాయజ్ఞంలో భాగస్వాములయ్యారు. ఆనాడు ఏ కారణం చేతనో బయటికి రాలేని శక్తులు ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఇండియా వేదికకు బాసటగా నిలిచేందుకు ముందుకొచ్చాయి. పార్లమెంట్‌ లేదా రాష్ట్రాల చట్టసభల వద్ద నిరసనలు, బహిరంగ లేఖలు, పిటిషన్లు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారాలు, పత్రికా సమావేశాలు, ఉపన్యాసాలు…ఇలా వివిధ రూపాల్లో గత పది సంవత్సరాలుగా ప్రజలు ప్రభుత్వంపై తమ అసమ్మతిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఐదు సంవత్సరాలుగా వ్యూహాత్మకంగా సాగిన ఉద్యమ కార్యాచరణ బీజేపీని ఎన్నికల్లో ఓడించడమే కాకుండా సైద్ధాంతికంగా కూడా ఆ పార్టీని దెబ్బతీసింది. ఇదే అసలైన పోరాటం. ఎన్నికల్లో గెలుపు అనేది తొలి అడుగు మాత్రమే. మున్ముందు చేయాల్సిన కృషి చాలా ఉంది. ఇందుకు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఇప్పుడు అనుకూలంగా ఉన్నాయి.

అధ్యాత్మిక కేంద్రాల్లోనూ తప్పని ఓటమి

హిందూత్వను హైజాక్‌ చేసేందుకు ప్రయత్నించిన బిజెపి చివరికి ఫైజాబాద్‌లో కూడా ఓటమి పాలైంది. స్రవస్తి, సీతాపూర్‌, చిత్రకూట్‌, మయాపూర్‌, షిర్డీ, తిరుపతి, రామనాథపురం వంటి ఆధ్యాత్మిక కేంద్రాల్లో కూడా బిజెపికి పరాభవం తప్పలేదు. హిందూత్వ వాదాన్ని తలకెత్తుకున్నప్పటికీ అనేక హిందూ దేవాలయ ట్రస్ట్‌ బోర్డులు బిజెపికి గుడ్డిగా మద్దతు ఇవ్వకపోవడం గమనార్హం. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులకు వ్యతిరేకంగా హిందువులను పోటీకి నిలబెట్టినప్పటికీ ప్రజలు బిజెపికి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. మతపరమైన ఆరోపణలు చేస్తూ ప్రచారం చేసిన వారికి ఇది ఓ గుణపాఠం. చివరికి వారణాసిలో మోడీ మెజారిటీ కూడా పడిపోయింది. సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌ వంటి నినాదాలు ఇచ్చినప్పటికీ దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు ఇండియా వేదికకు ఓటేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పు ఎలా ఉన్నప్పటికీ మోడీ, షా ద్వయానికి దేశానికి నేతృత్వం వహించే నైతిక హక్కు మాత్రం లేదు.

శాసనసభ ఎన్నికలకు సంసిద్ధత

దేశంలో గాలి మార్పు స్పష్టంగా కన్పించింది. ప్రజలందరూ కులాలు, మతాలకు అతీతంగా గంగాాజమునీ తహ్జీబ్‌ రక్షణ కోసం ప్రాణాలను ఫణంగా పెట్టారు. వసుధైక కుటుంబంపై విశ్వాసం ప్రకటించారు. ఇక వెనకడుగు వేసే ప్రసక్తే లేదని వారంతా ఓ తనిర్ణయానికి వచ్చారు. ఈ సంవత్సరం చివర్లో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో కూడా బిజెపికి చేదు అనుభవాలు మిగిల్చేందుకు ఇండియా వేదిక సిద్ధమవుతోంది. ఎందుకంటే అదేమంత కష్టం కాదు.

➡️