ధర్మేంద్రపై ఆగ్రహజ్వాలలు

  • పార్లమెంటు ఉభయ సభల్లో రెండో రోజూ దుమారం
  • నల్ల దుస్తులతో డిఎంకె నేతల నిరసన
  • కేంద్ర విద్యామంత్రిపై ప్రివిలేజ్‌ నోటీస్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : తమిళనాడు ఎంపీలు అనాగరికులు, అప్రజాస్వామికవాదులంటూ దురహంకార వ్యాఖ్యలు చేసిన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధరేంద్ర ప్రదాన్‌పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం పలుచోట్ల నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పార్లమెంటు ఉభయసభల్లో రెండో రోజూ ధర్మేంద్ర వ్యాఖ్యలు, ఆయన వ్యవహరించిన తీరుపై దుమారం చెలరేగింది. డిఎంకెకు చెందిన ఎంపీలందరూ నల్లని దుస్తులు ధరించి పార్లమెంటుకు వచ్చారు. ధర్మేంద్ర ప్రదాన్‌ క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ అటు సభలోనూ, సభ వెలుపుల ఆందోళన చేపట్టారు. వీరికి ప్రతిపక్షాలకు చెందిన పలువురు ఎంపీలు మద్దతు తెలియజేశారు. ఒక ప్రాంతానికి చెందిన ఎంపీలందరినీ అనాగరికులు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం ద్వారా ధర్మేంద ప్రధాన్‌ సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని, ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా లోక్‌సభలో డిఎంకె ఎంపీ కనిమొళి ప్రివిలేజ్‌ నోటీసులు ఇచ్చారు. అనంతరం పార్లమెంటు ప్రాంగణం వద్ద జరిగిన ఆందోళనలో కనిమొళి మాట్లాడుతూ తమిళనాడులో పిల్లల భవిష్యత్తును కేంద్ర ప్రభుత్వం నాశనం చేస్తోందని విమర్శించారు. జాతీయ విద్యా విధానం, త్రిభాషా విధానాన్ని అమలు చేయకపోతే విద్యా రంగానికి నిధులు నిలిపివేస్తామని కేంద్ర ప్రభుత్వం బెదిరిస్తోందని ఆమె విమర్శించారు. తమిళనాడులో పిల్లలకు రావాల్సిన నిధులను నిలిపివేసే అధికారం కేంద్రానికి లేదన్నారు.

రాజ్యసభలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయం అనంతరం విద్యాశాఖ పనితీరుపై చర్చ మొదలైంది. చర్చ ప్రారంభించాలని కాంగ్రెస్‌ సభ్యుడు దిగ్విజరు సింగ్‌ను డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ సూచించారు. ఇదే సమయంలో ధర్మేంద్ర ప్రధాన్‌ క్షమాపణ చెప్పాలని డిఎంకె ఎంపిలు డిమాండ్‌ చేశారు. ఈ గందరగోళం మధ్య జోక్యం చేసుకున్న ఖర్గే ఉదయం తాను మాట్లాడేటప్పుడు కూడా విద్యాశాఖ మంత్రి సభలో లేరన్నారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తిస్తోందన్నారు. అప్రజాస్వామిక చర్యలను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయని చెబుతూ..ఖర్గే ఓ హిందీ పదాన్ని వాడారు. దీనిపై అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రతిపక్ష నేత వాడిన పదజాలం ఖండించదగిందని రాజ్యసభ పక్షనేత జెపి నడ్డా అన్నారు. ఖర్గే క్షమాపణలు చెప్పాలని, ఆయన అన్న మాటలను రికార్డుల నుంచి తొలగించాలని పట్టుబట్టారు. ఆ వెంటనే స్పందించిన ఖర్గే.. తాను ఆ పదజాలాన్ని వాడినందుకు క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. అయితే, అవి చైర్‌ను ఉద్దేశించి చేయలేదని, ప్రభుత్వ విధానాల గురించి అలా మాట్లాడానని స్పష్టత ఇచ్చారు.

కేంద్ర మంత్రిపై ప్రివిలిజ్‌ మోషన్‌

తమిళనాడు ఎంపీలు అనాగరికులంటూ ధర్మేంద్ర ప్రధాన్‌ వ్యాఖ్యానించండంపై లోక్‌సభలోనూ రెండో రోజు తీవ్ర దుమారం చెలరేగింది. ఆయన చేసిన వ్యాఖ్యలు అధికార దురహంకారంతో చేసినవిగా డిఎంకె ఎంపి కనిమొళి ఆగ్రహం వ్యక్తం చేవారు. తమిళ సమాజానికి భేషరతుగా ధర్మేంద్ర ప్రధాన్‌ క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఆయన తమిళ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని పేర్కొంటూ ఆయనపై సభ హక్కుల ఉల్లంఘన తీర్మానం (ప్రివిలిజ్‌ మోషన్‌) ప్రవేశపెట్టారు. తమిళులు అనాగరికులు అంటూ ధర్మేంద్ర ప్రధాన్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆయన తక్షణమే క్షమాపణలు చెప్పాల్సిందిగా డిఎంకెతో పాటు ఎనిమిది కోట్ల తమిళుల పక్షాన డిమాండ్‌ చేస్తున్నానని కనిమొళి అన్నారు. పిఎం శ్రీ పథకం విషయంలో తమిళనాడు ప్రభుత్వం ఎంఒయుపై సంతకాలకు అంగీకరించి, ఆపై వెనక్కి తగ్గిందని ధర్మేంద్ర ప్రధాన్‌ చేసిన వ్యాఖ్యల్లో ఏమాత్రం వాస్తవం లేదని ఆమె అన్నారు. ఈ ప్రకటన పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించేదేనని, ఇది కూడా సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపారు. కనిమొళి ఇచ్చిన తీర్మానాన్ని స్పీకర్‌ ఓం బిర్లా పరిశీలించనున్నారు. ఒకవేళ స్పీకర్‌ గనుక ఆ తీర్మానాన్ని అంగీకరిస్తే దర్యాప్తునకు ఆదేశిస్తారు. అందులో ఉల్లంఘన జరిగినట్లు తేలితే క్రమశిక్షణా ఉల్లంఘన కింద ధర్మేంద్ర ప్రధాన్‌పై చర్యలు తీసుకోవాల్సివుంటుంది.

➡️