లక్నో : గురువారం ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో కురిసిన భారీ వర్షాల వల్ల 40 మందికి పైగా మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లో గురువారం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల వల్ల కనీసం 22 మంది అయినా మృతి చెందారు. ఇక ఈ వర్షాల దెబ్బకు 15 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 45 జంతువులు చనిపోయినట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. ఈ సందర్భంగా మృతులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయలు పరిహారాన్ని ప్రకటించారు. ఈ మేరకు యోగి ఆదిత్యనాథ్ ఎక్స్ పోస్టులో వెల్లడించారు.
కాగా, శుక్రవారం కూడా ఉత్తరప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ప్రాంతీయ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. లక్నో, వారణాసి, అయోధ్య, చందౌలీ, బారాబంకి, శ్రావస్తి, బలరామ్‌పూర్, మహారాజ్‌గంజ్, సిద్ధార్థ నగర్, ఖుషీనగర్, గోండా, బస్తీ, గోరఖ్‌పూర్, డియోరియా, ఉన్నావ్, ప్రతాప్‌గఢ్, అమేథి, సుల్తాన్‌పూర్, జౌన్‌పూర్, అంబేద్కర్ నగర్, సన్బీర్ నగర్, సుల్తాన్‌పూర్, ఎస్.ఝాజీపూర్ వంటి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనావేసింది.
బీహార్‌లో ఉరుములు, మెరుపుల వర్షం వల్ల 21 మంది మృతి చెందారు. ఒకరు పిడుగుపాటుకు గురై మృతి చెందారు. ఈ వర్షాల వల్ల ఇళ్లు కూలిపోయాయి. పశువులు మృతి చెందాయి. భారీగా పంట నష్టం జరిగింది. ఈ ఘటనలో మృతులకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయలు పరిహారాన్ని ప్రకటించారు.
