న్యూఢిల్లీ : వక్ఫ్ (సవరణ) బిల్లుని ముస్లిం కమ్యూనిటీ తిరస్కరిస్తోందని ఎఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. సోమవారం పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంపై జరిగిన చర్చలో ఆయన పాల్గన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ బిల్లుని ముస్లిం కమ్యూనిటీ పూర్తి తిరస్కరించిందని అన్నారు. ఈ బిల్లు అమలుతో దేశం 1980, 1990ల్లోకి తీసుకువెళుతోందని అన్నారు.
”నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. మీరు ప్రస్తుత రూపంలో వక్ఫ్ చట్టాన్ని అమలు చేస్తే, అది ఆర్టికల్ 25,26 మరియు 14ను ఉల్లంఘించినట్లు అవుతుంది. వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకుంటుంది. ఇక ఏమీ మిగలవు. ఈ చర్య దేశంలో సామాజిక అస్థిరతకు దారితీస్తుంది. ఈ బిల్లుని ముస్లిం కమ్యూనిటీ తిరస్కరించింది. గర్వించదగిన భారతీయ ముస్లింగా నేను మసీదులో, దర్గాలో ఒక్క అంగుళం కూడా వదులు కోను.. అందుకు అనుమతించను” అని ఒవైసీ స్పష్టం చేశారు.