ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సిపిఎం తమిళనాడు రాష్ట్ర కార్యదర్శిగా పి.షణ్ముగం ఎన్నికయ్యారు. 80 మందితో రాష్ట్ర నూతన కమిటీ ఎన్నికయింది. అందులో 15 మందితో రాష్ట్ర కార్యదర్శి వర్గం ఎన్నికయింది. విల్లుపురంలో మూడు రోజుల పాటు జరిగిన సిపిఎం తమిళనాడు 24 రాష్ట్ర మహాసభ ఆదివారం ముగిసింది. ఈ మహాసభకు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు, సమన్వయకర్త ప్రకాష్ కరత్, పొలిట్ బ్యూరో సభ్యులు బృందా కరత్, ఎంఎ బేబి, కె.రామకృష్ణన్ హాజరయ్యారు. సిపిఎం తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్ రాజకీయ, నిర్మాణ నివేదికను మహాసభ ముందు ఉంచారు. ఈ నివేదికపై ప్రతినిధులు చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం రాష్ట్ర నూతన కమిటీని మహాసభ ఎన్నుకుంది. 80 మందితో రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక అయింది. నూతన కార్యదర్శిగా పి.షణ్ముగం ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా యు.వాసుకీ, ఎన్.గుణశేఖరన్, కనగరాజన్, ఎ.రామలింగం, ఎస్.వెంకటేశన్, బాలభారతి, జి.సుకుమారన్, శామ్యంగల్ రాజు, ఎస్.కన్నన్, ఎన్.పాండీ, బి.రవీంద్రన్, ముత్తు కన్నన్ ఎన్నికయ్యారు. జాతీయ నేతలు మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. దేశంలోని వనరులను పెట్టుబడిదారులకు దోచిపెడుతున్నారని విమర్శించారు. నిరుద్యోగ యువతను, సంక్షోభంలోని రైతులను, సమస్యలో ఉన్న కార్మికులను మోడీ సర్కార్ పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఎంతసేపు అదానీ, అంబానీల చుట్టే ప్రభుత్వం పని చేస్తోందని విమర్శించారు. మోడీ హయంలో అవినీతి దేశ సరిహద్దులను దాటిపోయిందని పేర్కొన్నారు. అందుకు అదానీ ముడుపుల వ్యవహరాన్ని ఉదాహరించారు. సిపిఎస్ రద్దు తదితర అంశాలపై తీర్మానాలు చేశారు.
