రాజకీయాలకు పాండియన్‌ గుడ్‌బై

Jun 10,2024 00:22 #Pandian, #politics

భువనేశ్వర్‌: ఒడిషా మాజీ సీఎం నవీన్‌ పట్నాయక్‌ సన్నిహితులు, మాజీ ఐఏఎస్‌ అధికారి వికె పాండియన్‌ రాజకీయాలకు గుబ్‌బై చెప్పారు. ఇటీవల జరిగిన ఒడిషా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బిజూ జనతాదళ్‌ (బిజెడి) ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో పాండియన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఆదివారం ఈ మేరకు వీడియో విడుదల చేశారు. తాను నవీన్‌ పట్నాయక్‌కు సహాయంగా ఉండాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, ఇప్పుడు రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. తన రాజకీయ ప్రయాణంలో ఎవర్నైనా నొప్పించి ఉంటే క్షమించాలని కోరారు. అలాగే, తనపై జరిగిన దుష్ప్రాచారం వల్ల పార్టీ ఓటమి పాలై ఉంటే అందుకూ క్షమించాలన్నారు. నవీన్‌ మరోసారి విజయం సాధించని పక్షంలో తాను రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని గతంలో చెప్పిన పాండియన్‌ అందుకు తగ్గట్టే తన నిర్ణయాన్ని వెలువరించారు. తమిళనాడుకు చెందిన పాండియన్‌ ఒడిషా కేడర్‌ ఐఎఎస్‌ అధికారిగా ఈ రాష్ట్రంలో విధుల్లో చేరారు. అనంతరం నాటి ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కు సన్నిహితునిగా మారారు. ఎన్నికల ముందు ఉద్యోగానికి రాజీనామా చేసి బిజెడిలో చేరారు. నవీన్‌ పట్నాయక్‌ నిర్ణయాలను పాండియన్‌ ప్రభావితం చేస్తున్నారని, ఆయన ఎలా చెబితే అలా నవీన్‌ నడుస్తున్నారంటూ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఆరోపణలు గుప్పించింది.

➡️