గువహటి : ప్రశ్నాపత్రాల లీక్ వార్తల నేపథ్యంలో 11వ తరగతికి సంబంధించిన అన్ని పరీక్షలను రద్దు చేస్తున్నట్లు అస్సాం విద్యామంత్రి రనోజ్‌పెగు ప్రకటించారు. అస్సాం స్టేట్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్ (ఎఎస్‌ఎస్‌ఇబి) మార్చి 21న జరగాల్సిన హయ్యర్ సెకండరీ మొదటి సంవత్సరం గణితం ప్రశ్నాపత్రం లీకైన సంగతి తెలిసిందే.
హయ్యర్ సెకండరీ మొదటి సంవత్సరం (11వ తరగతి) పరీక్షలు మార్చి 6 నుండి మార్చి 29 వరకు జరగనున్నాయి. ప్రశ్నాపత్రం లీక్ కావడం మరియు ప్రోటోకాల్ ఉల్లంఘనకు సంబంధించిన నివేదికల కారణంగా, మిగిలిన సబ్జెక్టుల పరీక్షలు రద్దు చేయబడ్డాయి అని పెగు ఎక్స్‌లో పేర్కొన్నారు. పరీక్షల కొత్త షెడ్యూల్‌ను సోమవారం జరగనున్న బోర్డు సమావేశంలో నిర్ణయిస్తామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్రభుత్వ సంస్థలు సహా 18 పాఠశాలలు పరీక్షకు ఒక రోజు ముందుగా సీల్‌ను తీయడంతో మ్యాథ్స్ ప్రశ్నాపత్రం లీకైందని మంత్రి మరో పోస్ట్‌లో తెలిపారు.