నిమిషాల్లో పార్లమెంట్‌ వాయిదా

Nov 30,2024 00:29 #adjourned, #minutes, #Parliament
  • అదానీ, మణిపూర్‌, సంభాల్‌పై చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్షాలు
  • నిరాకరించిన మోడీ సర్కార్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అదానీ ముడుపుల వ్యవహారం, మణిపూర్‌ హింస, ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో శాంతి భద్రతల ఉల్లంఘన అంశాలపై చర్చకు ప్రభుత్వం తిరస్కరించడానికి నిరసనగా ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో పార్లమెంట్‌ ఉభయ సభలు సమావేశమైన కొద్ది నిమిషాలకే మరుసటి రోజుకు వాయిదా పడ్డాయి. తొలుత లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదానీ ముడుపుల వ్యవహారంపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రతిపక్షాల ఆందోళన నడుమ స్పీకర్‌ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. ప్రతిపక్ష సభ్యుల నిరసనలు, అరుపులతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో సభ మొదలైన పది నిమిషాలకే మధ్యాహ్నం 12 గంటలకు స్పీకర్‌ ఓం బిర్లా వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాలు తమ ఆందోళనను కొనసాగించాయి. ప్యానల్‌ స్పీకర్‌ దిలీప్‌ సైకియా అదానీ వ్యవహారం, మణిపూర్‌ హింస, సంభాల్‌ హింసపై ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మాన నోటీసులను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఎవరు ఏమి మాట్లాడుతున్నదీ వినిపించలేదు. ఈ గందరగోళం మధ్య నేషనల్‌ ఎఆర్‌టి అండ్‌ సరోగసీ బోర్డులో ఇద్దరు మహిళా సభ్యులను నియమిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా లోక్‌ సభ దీన్ని ముజువాణి ఓటుతో ఆమోదించింది. ఆ వెంటనే సభను సోమవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి. చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ ప్రతిపక్ష సభ్యులు ఇచ్చిన 17 వాయిదా తీర్మాన నోటీసులను తిరస్కరించారు. ప్రతిష్టంభన కొనసాగడంపై ధన్‌ఖర్‌ అసహనం వ్యక్తం చేశారు.

ఢిల్లీలో శాంతి భద్రతలపై ఆప్‌ ఆందోళన

ఢిల్లీలో శాంతిభద్రతలు క్షీణించడాన్ని నిరసిస్తూ ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపిలు పార్లమెంట్‌ ఆవరణంలో ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో ఆప్‌ ఎంపిలు సంజరు సింగ్‌, రాఘవ్‌ చద్డా తదితరులు ప్లకార్డులు చేబూని మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాల హౌరెత్తించారు.

➡️