న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండవ రోజైన మంగళవారం డిఎంకె నిరసనలతో రాజ్యసభ వాయిదా పడింది. డీలిమిటేషన్‌పై డిఎంకె ఎంపిలు ఆందోళన చేపట్టాయి. డీలిమిటేషన్‌పై చర్చ చేపట్టేందుకు ఆరోజు జాబితా చేసిన సభా కార్యకలాపాలను పక్కన పెట్టాలని కోరుతూ… ప్రతిపక్ష ఎంపిలు 267 నిబంధన కింద నోటీసులు ఇచ్చారు. అలాగే నకిలీ ఓటరు ఐడి కార్టుల జారీ అవకతవకలపై చర్చించాలని బిజెడి, ఆప్ నోటీసులిచ్చాయి. అయితే ఈ నోటీసులు నిబంధనలకు అనుగుణంగా లేవంటూ 21 నోటీసులను చైర్మన్ హరివంశ్ నారాయణ్ తిరస్కరించారు. ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో సభను వాయిదా వేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సైతం నోటీసులను తిరస్కరించారు. అనంతరం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయం ముగిసింది.
ధర్మేంద్ర ప్రధాన్‌పై హక్కుల తీర్మానం ప్రవేశపెట్టిన డిఎంకె
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయనకు వ్యతిరేకంగా డిఎంకె ఎంపి కనిమొళి హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి ఎండిఎంకె ఎంపి వైకో మద్దతు తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ తమిళనాడు ఎంపిలతో పాటు తమిళనాడు సిఎంను దుర్భాషలాడారని అన్నారు.