న్యూఢిల్లీ : అదానీ ముడుపుల వ్యవహారంపై పార్లమెంటు దద్దరిల్లుతోంది. గత కొన్నిరోజులుగా జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో అదానీ ముడుపుల విషయం, మణిపూర్ సంక్షోభంపై చర్చ జరగాలని ప్రతిపక్ష ఎంపీలు ఉభయ సభల్లో పట్టుబడుతున్నారు. అయితే ఈ విషయాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధపడడం లేదు. దీంతో ఉభయసభలూ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడుతున్నాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయసభలు వాయిదాపడ్డాయి. లోక్‌సభ ప్రారంభమైన 6 నిమిషాలకే వాయిదాపడింది. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. ఈ సందర్భంగా స్పీకర్ పార్లమెంటు గౌరవాన్ని కాపాడాలని అధికార, ప్రతిపక్ష ఎంపీలను కోరారు. సభలో ఎంపీలు పార్లమెంటు గౌరవాన్ని కాపాడేలా ప్రవర్తిస్తే.. ప్రజల్లోకి మంచి సందేశం వెళుతుంది అని ఆయన అన్నారు. మరోవైపు సభ వాయిదా అనంతరం అదానీ వ్యవహారంపై కేంద్రప్రభుత్వం సమాధానం ఇవ్వాలని పార్లమెంటు వెలుపల ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తూ నిరసన చేశారు. సభలు వాయిదాల పర్వం నేపథ్యంలో… పార్లమెంటు సజావుగా నడపకూడదని ప్రభుత్వం నిర్ణయించుకుందని కాంగ్రెస్ సీనియర్ నేత కెసి వేణుగోపాల్ విమర్శించారు.
కాగా, మరోవైపు రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. ఈరోజు సభలో గందరగోళం నెలకొనడంతో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్ మధ్యాహ్నం 12 గంటలకు సభను వాయిదా వేశారు. తిరిగి సభ పారంభమైనా మధ్యాహ్నం 1 గంటకు మరోసారి వాయిదాపడింది.