రెండో రోజూ స్తంభించిన పార్లమెంట్‌

Nov 28,2024 00:34 #Parliament, #second day, #stalled
  • అదానీ వ్యవహారంపై జెపిసి విచారణకు పట్టుబట్టిన ప్రతిపక్షాలు
  • తిరస్కరించిన ప్రభుత్వం
  • ఉభయ సభల్లో గందరగోళం: నేటికి వాయిదా

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అదానీ ముడుపుల వ్యవహాహరం రెండో రోజూ పార్లమెంటును కుదిపేసింది. దీనిపై జెపిసితో విచారణ జరిపించాలని ఉభయ సభల్లోనూ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అవి ఇచ్చిన వాయిదా తీర్మాన నోటీసులను తిరస్కరిస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ ప్రకటించారు. దీంతో కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు సభా మధ్య భాగంలోకి దూసుకెళ్లిన నిరసన తెలపగా, మిగతా ప్రతిపక్ష సభ్యులు తమ స్థానాల్లోంచి లేచి నడవలో నిలబడి నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాలను అనుమతించాల్సిందిగా వారికి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కోరారు. ఈ గందరగోళం మధ్య బిజెపి ఎంపీ అరుణ్‌ గోవిల్‌ ఒక ప్రశ్న అడిగారు. అయినా, నిరసనలు కొనసాగడంతో సభను తొలుత మధ్యాహ్నానికి వాయిదా పడింది. ఆ తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో సభను గురువారానికి వాయిదా వేశారు. ఎగువ సభలోనూ ఇదే పరిస్థితి. దీంతో సభను 11.30 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. దీంతో సభను చైర్మన్‌ ధన్‌కర్‌ గురువారానికి వాయిదా వేశారు.

అదానీ జైల్లో ఉండాలి: రాహుల్‌ గాంధీ

వేల కోట్ల రూపాయాల ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ జైల్లో ఉండాలని ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ అన్నారు. చిన్న, చిన్న ఆరోపణలతోనే వందలాది మందిని అరెస్టు చేశారని, అలాంటప్పుడు వేల కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీని ఎందుకు అరెస్టు చేయరని ఆయన ప్రశ్నించారు. బుధవారం లోక్‌సభ వాయిదా పడిన అనంతరం పార్లమెంట్‌ ఆవరణలో ప్రతిపక్ష నేత రాహుల్‌ మీడియాతో మాట్లాడుతూ, ”అదానీ ఆరోపణలను అంగీకరిస్తారని మీరు అనుకుంటున్నారా? ఆయన ఎప్పటిలానే బుకాయిస్తారు. ఆయన పాల్పడిన ఆర్థిక నేరాలకు జైలులో పెట్టాలి. కానీ, దీనికి భిన్నంగా ప్రభుత్వం ఆయనను కాపాడేందుకు యత్నిస్తోంది. ఇది చాలా దారుణం” అని రాహుల్‌ విమర్శించారు.
ఇదిలా వుండగా సంభాల్‌ హింసపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని, సుప్రీం కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని సమాజ్‌వాది పార్టీ డిమాండ్‌ చేసింది. ఆ పార్టీ ఎంపీ డింపుల్‌ యాదవ్‌ మాట్లాడుతూ సంభాల్‌ అంశంపై పార్లమెంటులో చర్చించాలని డిమాండ్‌ చేశారు.

➡️