మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించాలి

Dec 10,2024 00:45 #Manipur, #must be restored, #Peace
  • జంతర్‌ మంతర్‌ వద్ద ఇండియా బ్లాక్‌ ధర్నా

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఏడాదిన్నర కాలంగా అల్లర్లతో అల్లాడుతున్న మణిపూర్‌లో శాంతి, సాధారణ పరిస్థితులను పునరుద్ధరించాలని సిపిఎం సమన్వయకర్త ప్రకాశ్‌ కరత్‌ డిమాండ్‌ చేశారు. మణిపూర్‌లో శాంతి, సామరస్యం, సాధారణ పరిస్థితులు నెలకొనేలా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం జంతర్‌ మంతర్‌ వద్ద ఇండియా బ్లాక్‌ పార్టీల ఆధ్వర్యాన ధర్నా జరిగింది. అనంతరం తక్షణమే మణిపూర్‌లో పర్యటించాలని ప్రధాని మోడీకి ఇండియా బ్లాక్‌ నేతలు వినతిపత్రం సమర్పించారు. మణిపూర్‌లో హింసకు ప్రధాని మోడీ బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. మణిపూర్‌లో ప్రాణాలకు, ఆస్తులకు భద్రత లేకుండా పోయిందన్నారు. సుదీర్ఘంగా కర్ఫ్యూ, ఇంటర్నెట్‌ నిషేధం, ధరల పెరుగుదల, మందుల కొరత, జాతీయ రహదారుల దిగ్బంధనం, కిడ్నాప్‌లు ప్రజలను అభద్రతా స్థితిలోకి నెట్టాయని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. మణిపూర్‌ అగ్నిగుండంగా మారడానికి అనుమనితిచ్చిన ముఖ్యమంత్రిని వెంటనే తప్పించాలన్నారు.

ఈ సందర్భంగా ప్రకాశ్‌ కరత్‌ మాట్లాడుతూ.. ప్రజలను విభజించి పాలించే సూత్రంపై బిజెపి పనిచేస్తోందని విమర్శించారు. మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు లేకుండా అక్కడి ప్రజలను హింసిస్తున్నారని అన్నారు. ప్రజలపై హింస మంచిది కాదని, మణిపూర్‌ కూడా ఇండియాలోనే భాగమని ప్రధాని తెలుసుకోవాలని సూచించారు. ఏడాదిన్నరగా అక్కడ అరాచకం జరుగు తుంటే, కేంద్ర ప్రభుత్వం ఏమీ జరగనట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు. వెంటనే మణిపూర్‌లో సాధారణ పరిస్థితులను తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, మణిపూర్‌ మాజీ ముఖ్యమంత్రి ఓక్రమ్‌ ఇబోబీ సింగ్‌, కాంగ్రెస్‌ లోక్‌సభ ఉపనేత గౌరవ్‌ గొగోరు, ఎంపిలు జాన్‌ బ్రిట్టాస్‌, ఎఎ రహీం, రాజారామ్‌ సింగ్‌ కుష్వాహ, అంగోమ్‌చా బిమోల్‌, జ్యోతిమణి, శశి థరూర్‌, ఎన్‌కె ప్రేమచంద్రన్‌, రబీకుల్‌ హుస్సేన్‌, సలోంగ్‌ సంగ్మా, సుపోన్‌ మెరిన్‌ జమీర్‌, ఎఐకెఎస్‌ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్‌, ఉపాధ్యక్షులు హన్నన్‌ మొల్లా, సిపిఎం మణిపూర్‌ రాష్ట్ర కార్యదర్శి శాంత క్షత్రిమయం, సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్‌, గిరిష్‌ చోదంకర్‌, కన్నయ్య కుమార్‌ (ఎఐసిసి ఇన్‌ఛార్జులు), మయూక్‌ బిశ్వాస్‌, ఆరిఫ్‌ సిద్ధిక్‌ (ఎస్‌ఎఫ్‌ఐ), వరుణ్‌ చౌదరి (ఎన్‌ఎస్‌యుఐ), ఉదరు చిబ్‌ (యూత్‌ కాంగ్రెస్‌) పాల్గొని మాట్లాడారు.

➡️