పెగాసస్‌ నిఘా – భారత్‌ @100

 మొదటి స్థానంలో మెక్సికో  – ప్రపంచవ్యాప్తంగా 51 దేశాల్లో బాధితులు

న్యూఢిల్లీ : ఇజ్రాయిల్‌ ప్పైవేర్‌ పెగాసస్‌ బారిన పడిన వారు ఒక్క భారతదేశంలోనే వందమంది ఉన్నట్లు తేలింది. 2019వ సంవత్సరంలో చోటుచేసుకున్న వాట్సప్‌ హ్యాకింగ్‌లో ప్రపంచవ్యాప్తంగా 1223 మందిని లక్ష్యంగా చేసుకోగా వారిలో 100 మంది భారతదేశంలో ఉన్నట్లు తాజాగా ‘మీడియా నామా’ సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. యుఎస్‌ కోర్టులో జరుగుతుతన్న న్యాయపరమైన పోరాటాన్ని ఉటంకిస్తూ ఈ కథనం ప్రచురణ కావడం చర్చనీయాంశంగా మారింది పెగాసస్‌ను తయారు చేసే ఇజ్రాయెల్‌ ఎన్‌ఎస్‌ఓ గ్రూపు టెక్నాలజీస్‌, ‘మెటా’కు చెందిన వాట్సప్‌ మధ్య అమెరికా న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. దారనిలో భాగంగా తాజాగా దాఖలైన అఫిడవిట్‌ ప్రకారం ఈ సంఖ్యను ఆ సంస్థ నిర్ధారించింది. ఏప్రిల్‌ 2019 నుంచి మే 2019 మధ్య రెండు వారాల వ్యవధిలో 1400 మంది వాట్సప్‌ వినియోగదారులపై ఎన్‌ఎస్‌ఓ గ్రూపునకు చెందిన స్పైవేర్‌ ఉపయోగించబడిందని ‘వాట్సప్‌’ ఆరోపించింది. రెండు వారాల వ్యవధిలో పెగాసస్‌ ఉపయోగించి లక్ష్యంగా చేసుకున్న వ్యక్తుల సంఖ్యను దేశాలవారీగా వాట్సప్‌ జాబితా చేసింది. పెగాసస్‌ బాధిత వాట్సప్‌ వినియోగదారులు ప్రపంచవ్యాప్తంగా 51 దేశాలలో ఉన్నారు. ఈ జాబితాల్లో మెక్సికో ముందున్నది. 456 మందిని ఎన్‌ఎస్‌ఓ పెగాసస్‌ టార్గెట్‌గా చేసుకున్నది. ఆ తర్వాతి స్థానంలో భారత్‌ ఉన్నది. ఈ టార్గెట్‌లో భారత్‌ నుంచి వంద మంది ఉన్నారు. భారత్‌ తర్వాత.. బహ్రెయిన్‌ (82), మొరాకొ (69), పాకిస్థాన్‌ (58), ఇండోనేషియా (54)లు ఉన్నాయి. ఇక టర్కీ నుంచి 26 మంది, స్పెయిన్‌ నుంచి 21 మంది, ఫ్రాన్స్‌ నుంచి ఏడుగురిని ఈ స్పైవేర్‌ ద్వారా టార్గెట్‌ చేశారు. అయితే, 2019 వాట్సప్‌ హ్యాకింగ్‌ ప్రచారంలో లక్ష్యంగా చేసుకున్న వ్యక్తుల వివరాలు మాత్రం అస్పష్టంగా ఉన్నాయి. అయితే, మెటా వాదనలను ఎన్‌ఎస్‌ఓ తోసిపుచ్చినట్టు ఇజ్రాయెల్‌ వార్త సంస్థ ఒకటి వివరించింది.
2021 జులైలో 17 మీడియా సంస్థల బృందం, మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ జరిపిన దర్యాప్తులో.. భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులపై అనధికారిక నిఘా కోసం పెగాసస్‌ను ఉపయోగిస్తున్నట్టు తేలింది. భారత్‌లో కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ, మాజీ ఎన్నికల కమిషనర్‌ అశోక్‌ లావాసా, పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీ, సీబీఐ మాజీ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ వంటి వారు టార్గెట్‌ జాబితాలో ఉన్నట్టు ఇప్పటికే వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలను భారత ప్రభుత్వం ఖండించింది. భారత్‌లో అక్రమ నిఘా సాధ్యం కాదని అప్పటి కేంద్ర సమాచార సాంకేతిక మంత్రి వైష్ణవ్‌ 2021 జులైలో పార్లమెంటులో తెలిపారు. అయితే, ఆరోపణలపై సుప్రీంకోర్టు ఒక నిపుణుల కమిటీని ఏర్పర్చింది. 2022 ఆగస్టులో ఈ ప్యానెల్‌.. 29 ఫోన్లకు గానూ ఐదింటిలో మాల్వేర్‌ను గుర్తించిందని కోర్టు వివరించింది. ఈ విచారణకు మోడీ ప్రభుత్వం నుండి సహకారం లభించని విషయం తెలిసిందే.

➡️