పెమ్మసానే అత్యంత ధనికుడు

99 శాతం కేంద్ర మంత్రులు కోటీశ్వరులు
39 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ప్రధాని మోడీ కొత్త మంత్రివర్గంలోని 71 మంది మంత్రుల్లో 70 మంది (99 శాతం) కోటీశ్వరులే ఉన్నారు. 71 మంది మంత్రుల సగటు ఆస్తులు రూ.107.94 కోట్లు. ఆరుగురు మంత్రులకు రూ.100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు తమ ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎన్నికల వాచ్‌ డాగ్‌ అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఎడిఆర్‌) వెల్లడించింది. కొత్త మంత్రివర్గంలో బిజెపి నుండి 61 మంది, ఎన్‌డిఎ మిత్రపక్షాల నుండి 11 మంది ఉన్నారు. 72 మంది మంత్రుల్లో 43 మంది మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు ఎంపిలుగా ఎన్నికయ్యారు. 39 మంది గతంలో కేంద్ర మంత్రులుగా పనిచేశారు.
అత్యంత సంపన్నుడు పెమ్మసాని
మోడీ మంత్రివర్గంలో అత్యంత ధనిక మంత్రిగా, టిడిపి నుంచి లోక్‌సభకు ఎన్నికైన పెమ్మసాని చంద్రశేఖర్‌ నిలిచారు. ఆయనను గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖకు సహాయ మంత్రిగా నియమించారు. ఆ తరువాత స్థానంలో జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారు. ఆయన కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా ఉన్నారు. మూడో స్థానంలో ఉన్న హెచ్‌డి కుమారస్వామి కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రిగా నియమితులయ్యారు. అశ్వని వైష్ణవ్‌ రైల్వే, ఐ అండ్‌ బి, ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖల మంత్రిగా ఉన్నారు. ఐదో స్థానంలో ఉన్న పియుష్‌ గోయల్‌ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా ఈ మంత్రుల ఆస్తులను ఎడిఆర్‌ లెక్కించింది. 71 మంది కేంద్ర మంత్రుల్లో 47 (66 శాతం) మంది కొత్తవారు కాగా, వారి వయస్సు 51-71 మధ్య ఉంది. 11 మంది ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత సాధించగా, 57 మంది గ్రాడ్యుయేట్‌, ఆపైన చదివారు.
28 మందిపై క్రిమినల్‌ కేసులు
కేంద్ర మంత్రివర్గంలో 28 (39 శాతం) మంది మంత్రులు తమపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు ఎడిఆర్‌ వెల్లడించింది. వారు హత్యాయత్నాలు, కిడ్నాప్‌, మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని తమ అఫిడవిట్‌లలో పేర్కొన్నారు. వీరిలో 19 మంది మంత్రులపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నాయని ఎడిఆర్‌ విశ్లేషించింది. తమపై హత్యాయత్నం కేసులు ఉన్నట్లు ప్రకటించిన మంత్రుల్లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన శంతను ఠాకూర్‌, సుకాంత మజుందార్‌ ఉన్నారు.

➡️