ఎన్నికల బాండ్ల స్కామ్‌పై సిట్‌ దర్యాప్తు కోరుతూ పిటిషన్‌

May 14,2024 22:47 #Electoral Bonds, #sit, #supreem
  • సత్వర విచారణకు సుప్రీం హామీ

న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్ల కుంభకోణంపై దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను త్వరలో విచారణ చేపట్టేలా చూస్తామని సుప్రీం కోర్టు హామీ ఇచ్చింది. ప్రముఖ న్యాయవాది, ప్రశాంత్‌ భూషణ్‌ మంగళవారం నాడు సిట్‌ దర్యాప్తు పిటిషన్‌ గురించి ప్రస్తావించినప్పుడు సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఖన్నా ఆయనకు ఈ మేరకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆ పిటిషన్‌ భారత ప్రధాన న్యాయమూర్తి ముందు వుందని, ఆయన విచారణకు ఒక తేదీని కేటాయించి, బెంచ్‌ను ఏర్పాటు చేస్తారని తెలిపారు. ప్రశాంత్‌ భూషణ్‌, ఇతర న్యాయవాదులు చెరిల్‌ డిిసౌజా, నేహా రాథీలు ప్రాతినిధ్యం వహిస్తున్న ‘కామన్‌ కాజ’్‌, ‘ది సెంటర్‌ ఫర్‌ పబ్లిక్‌ ఇంటరెస్ట్‌ లిటిగేషన్‌’ తరపున ఈ పిటిషన్‌ వేశారు. దేశంలోని ప్రధాన దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఇడి, ఆదాయపన్ను శాఖ వంటి సంస్థలు అవినీతికి అనుబంధ సంస్థలుగా మారాయని ఆ పిటిషన్‌ పేర్కొంది. ఈ సంస్థల దర్యాప్తును ఎదుర్కొంటున్న పలు కంపెనీలు, సంస్థలు, దర్యాప్తు ఫలితాలను ప్రభావితం చేసేందుకు గానూ పాలక పార్టీకి పెద్ద మొత్తాల్లో విరాళాలు అందచేశాయని పిటిషన్‌లో ఆరోపించారు. అందువల్ల, ఈ కేసులో దర్యాప్తు జరిపితే ప్రతి సంఘటన వెనుక గల కుట్ర కుతంత్రాలు బయటపడడమే కాకుండా ఈ కుట్రలో భాగస్వాములైన ఇడి, ఐటి, సిబిఐ అధికారుల బండారం కూడా బయటపడుతుందని పిటిషనర్లు పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు కార్పొరేట్లు చేసిన క్విడ్‌ ప్రొ కో ఏర్పాట్లుగా ఈ బాండ్లు కనిపిస్తున్నాయని పేర్కొంటూ, హిందూ, ఇతర మీడియా సంస్థలు జరిపిన విస్తృతమైన డేటా తవ్వకాలను, వార్తలను ఈ సందర్భంగా పిటిషన్‌ ప్రస్తావించింది.

➡️