Shirur landslide : ట్రక్‌ డ్రైవర్‌ కుటుంబాన్ని పరామర్శించిన పినరయి విజయన్‌

కొజికోడ్‌ :    కేరళ  ట్రక్‌ డ్రైవర్‌ అర్జున్  కోసం గాలింపు చర్యలు చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కేరళ ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆదివారం ఉదయం కోజికోడ్‌లోని కన్నడిక్కల్‌లో అర్జున్‌ కుటుంబాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సందర్శించారు. అర్జున్‌ తల్లిదండ్రులు, భార్య, కుమారుడు సహా ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇటీవల కర్ణాటకలోని షిరూర్‌లో కొండచరియలు విరిగిపడటంతో కేరళ ట్రక్ డ్రైవర్ అర్జున్ గల్లంతైన సంగతి తెలిసిందే.

వీలైనంత త్వరగా గాలింపు చర్యలు చేపట్టాలని అర్జున్‌ కుటుంబం ముఖ్యమంత్రికి మెమోరాండం సమర్పించింది. వయనాడ్‌లో చాలా కుటుంబాలు ఆపదలో ఉన్నాయని, అర్జున్‌ కుటుంబ సమస్యను కూడా పరిగణనలోకి తీసుకుంటామని కుటుంబసభ్యులకు విజయన్‌ తెలిపారు. అనంతరం అర్జున్‌ సోదరి మీడియాతో మాట్లాడుతూ.. తమకు పూర్తి సహకారం అందిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని అన్నారు.

వాతావరణం అనుకూలించకపోవడంతో ఆదివారం నుండి షిరూర్‌లో తిరిగి పారంభం కావాల్సిన గాలింపు చర్యలు నిలిచిపోయాయి. ఈ ప్రాంతంలో వర్షం తీవ్రంగా ఉంది. సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టాల్సిన గంగావళి నదిలో గంటకు ఆరునాటికల్‌ మైళ్ల వేగంతో నీటి ప్రవాహం ఉంది. ఆదివారం తెల్లవారుజామునే సంఘటనా స్థలికి చేరుకున్న సహాయక బృందం జిల్లా యంత్రాంగం నుండి గ్రీన్‌ సిగల్‌ రాకపోవడంతో వెనుతిరిగింది. షిరూర్‌ ప్రాంతంపై ఐఎండి ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

➡️