PM CARES: అక్కరకు రాని పిఎం కేర్స్‌!

సగానికి పైగా దరఖాస్తుల తిరస్కృతి
కారణం కూడా వెల్లడించని కేంద్రం
న్యూఢిల్లీ : కోవిడ్‌ వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మిగిలిన పిల్లల బాగోగులు చూసేందుకు కేంద్రం తీసుకువచ్చిన పిఎం కేర్స్‌ పథకం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది.. ఈ పథకం కింద వచ్చిన దరఖాస్తుల్లో సగానికి పైగా దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్లు అధికారులు వెల్లడించారు. దీనికి నిర్దిష్ట కారణం కూడా వెల్లడించలేదు. దేశంలో కోవిడ్‌ విజృంభించిన సమయంలో అంటే 2021 మే 29న కేంద్రం పిఎం కేర్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ పథకాన్ని ప్రారంభించింది. చట్టబద్ధమైన సంరక్షకులను కోల్పోయినా లేదా దత్తత తీసుకున్న తల్లిదండ్రులు, కన్న తల్లిదండ్రులు ఎవరిని కోల్పోయినా ఆ పిల్లలకు తోడ్పాటునందించాలన్నది ఈ పథకం ఉద్దేశం. 2020 మార్చి 11 నుండి 2023 మే 5 మధ్య కరోనా మహమ్మారికి బలైన వారి పిల్లలకు ఇది వర్తిస్తుంది.
ఈ పథకం కింద 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలవ్యాప్తంగా 613 జిల్లాల నుండి 9,331 దరఖాస్తులు అందాయని అధికారిక డేటా వెల్లడించింది. అయితే వీటిలో 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 558 జిల్లాల నుండి వచ్చిన 4,532 దరఖాస్తులను మాత్రమే ఆమోదించారు. ఆమోదించిన సంఖ్య కన్నా ఎక్కువగా 4,781 దరఖాస్తులను తిరస్కరించారు. మరో 18 అప్లికేషన్లు ఆమోదం కోసం పెండింగ్‌లో వున్నాయని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి మీడియాకు తెలిపారు. అయితే దరఖాస్తులను తిరస్కరించడానికి గల కారణాలేమిటో కూడా మంత్రిత్వ శాఖ వెల్లడించలేదు. రాజస్థాన్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ల నుండి ఎక్కువ సంఖ్యలో అంటే వరుసగా 1553, 1511, 1007 దరఖాస్తులు అందగా వరుసగా 210, 855, 467 దరఖాస్తులు ఆమోదం పొందాయి.
అనాధలైన పిల్లల మంచి చెడులు చూసేందుకు స్థిరమైన రీతిలో వారికి సమగ్ర సంరక్షణ కల్పించాలన్నది ఈ పథకం లక్ష్యంగా వుంది. అంటే వారికి ఆరోగ్య బీమా కల్పించడం, విద్యనందించడం, వారికి 23ఏళ్లు వచ్చేవరకు ఆర్థిక తోడ్పాటునందించడం వంటి చర్యలు కేంద్రం తీసుకోవాల్సి వుంది. కానీ ఏకంగా 51శాతం దరఖాస్తులను తిరస్కరించారంటేనే ఈ పథకం ఏ రీతిన అమలు చేశారో అర్ధమవుతోంది.
కోవిడ్‌ వల్ల అనాధలైన వారే కాకుండా ఇతరత్రా తల్లిదండ్రులు లేని అనాధలందరికీ కూడా ఈ పథకం కింద ప్రయోజనాలు వర్తింపచేయాలని సుప్రీం కోర్టు గతంలోనే కేంద్రానికి సూచించింది.

➡️