ప్రజల కష్టాలను ప్రధాని పట్టించుకోరు : అమేథీలో ప్రియాంక

May 15,2024 00:27 #priyanka gandhi

అమేథీ (యుపి) : ”ప్రధాని మోడీ ప్రజల కష్టాలు పట్టించుకోరని, ”సంబంధం లేని” విషయాలనే మాట్లాడుతున్నారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా విమర్శించారు. అమేథీ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి కిషోరీ లాల్‌ శర్మకు మద్దతుగా మోహియా కేసరియాలో ఏర్పాటుచేసిన ఎన్నికల సభలో ఆమె ప్రసంగించారు. ప్రధాని ప్రజలను ప్రేమించడం లేదని, ఏ రైతు ఇంటికి వెళ్లలేదని ఆమె అన్నారు. ”నిన్న అతను వారణాసిలో రోడ్‌ షో నిర్వహించారు. ఎత్తైన వాహనంపై, చుట్టూతా భద్రతా సిబ్బంది మధ్య నిలబడి చేతులు ఊపారు. మీ బాధ ఏమిటో అతనికి ఎలా తెలుస్తుంది? (అతను) కేవలం ‘సేతులు’ (వ్యాపారవేత్తలతో) మాత్రమే కనిపిస్తారు” ఆమె అన్నారు. అమేథీలో ప్రజలు ఓడించిన తన సోదరుడు రాహుల్‌ గాంధీ కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు 4,000 కిలోమీటర్లు నడిచి దేశప్రజల సమస్యలు విన్నారని ఆమె అన్నారు. ఎన్నికల సమయంలో గేదెలు, మంగళసూత్రాలు, గుళ్లు, మసీదుల గురించి మాట్లాడకూడదని మోడీకి చెప్పాలని ప్రియాంక గాంధీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రధాన మంత్రి, అమేథీ ఎంపీ (స్మృతి ఇరానీ) సహా బిజెపి నేతలు ప్రజల పట్ల జవాబుదారీతనం లేదని భావిస్తున్నారని చెప్పారు. మతం ప్రాతిపదికన ఓటు వేస్తారని భావిస్తున్నారని ఆమె అన్నారు. రైతుల కోసం మోడీ ఏం చేశారో చెప్పలేరని అన్నారు. అక్కడక్కడా మాట్లాడి ప్రజల దృష్టిని మరల్చుతున్నారని ఆమె అన్నారు. ”ఎలక్టోరల్‌ బాండ్లతో అతిపెద్ద అవినీతి పథకాన్ని మోడీ తీసుకువచ్చారు. ఇందులో విరాళం ఇచ్చే వ్యక్తి పేరు రహస్యంగా ఉంటుంది” అని ప్రియాంక గాంధీ చెప్పారు.

➡️