- రాష్ట్ర హోదా పునరుద్ధరణపై దాటవేత
సొనామార్గ్ : కాశ్మీర్‌లోని గందెర్బాల్ జిల్లాలో నిర్మించిన జెడ్- మోడ్ టన్నెల్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జమ్ముకాశ్మీర్‌లో నూతన రహదార్లు, రైల్వే లైన్ల గురించి వివరాలు తెలిపారు. అయితే, జమ్ముకాశ్మీర్‌కు రాష్ట్ర హోదా మళ్లీ ఎప్పుడు పునరుద్ధరించేది చెప్పలేదు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జమ్ముకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన ప్రసంగంలో రాష్ట్ర హోదా డిమాండ్ గురించి ప్రస్తావించారు. దీనికి ఆయన సమాధానం ఇస్తూ, ‘మోడీ వాగ్దానం చేస్తే దాన్ని నెరవేరుస్తాడు. ప్రతి దానికి సరైన సమయం ఉంటుంది. సరైన సమయంలో సరైన పనులు జరగుతాయి’ అని తెలిపారు. అలాగే ఈ టన్నెల్ గురించి మోడీ మాట్లాడుతూ, 2015లో శంకుస్థాపన జరిగిందని, ఇప్పుడు దీనిని ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ టన్నెల్‌తో సొనామార్గ్‌లో పర్యాటకరంగం కొత్త పుంతలు తొక్కుతుందని తెలిపారు. కాశ్మీర్‌ను లడఖ్‌తో కలిపే శ్రీనగర్ – లేV్‌ా జాతీయ రహదారిపై సొనామార్గ్‌కు సమీపంలో గగంగిర్ గ్రామం వద్ద నిర్మించారు. 6.5 కిలోమీటర్లు పొడవైన ఈ టన్నెల్‌ను రూ 2,700 కోట్లతో నిర్మించారు. వాస్తవానికి దీనిని 2023 ఆగస్టులోనే ప్రారంభించాల్సి ఉంది. కానీ అనేక సమస్యలతో నిర్మాణం ఆలస్యమయింది. ఈ ప్రారంభం సందర్భంగా మోడీ మాట్లాడుతూ జమ్ముకాశ్మీర్ అనేది భారత దేశానికి కిరీటమని, కాబట్టి ఇది అందంగా, బలంగా ఉండాలని చెప్పారు. ఇక్కడ చీనాబ్ వంతెన నిర్మాణం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆశ్చర్యపరిచిందని, ఈ వంతెనపై ఇటీవలే ప్యాసింజర్ రైలు ట్రయల్స్ పూర్తయ్యాయని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఒమర్ అబ్దుల్లాతో పాటు, జమ్ముకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా ప్రసంగించారు.