కచ్ (గుజరాత్) : దేశ సరిహద్దుల్లో ఒక్క అంగుళం భూమి విషయంలోనూ భారత్ రాజీపడబోదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. సరిహద్దుల్లో గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని అక్కడి కచ్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న సరిహద్దు భద్రతా దళం, ఆర్మీ, నేవీ, వాయుసేన సిబ్బందితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఆర్మీ యూనిఫాం ధరించిన ప్రధాని.. కచ్‌లోని సర్ క్రీక్ ప్రాంతంలో గల లక్కీ నాలాకు బోటులో చేరుకున్నారు. అనంతరం బీఎస్‌ఎఫ్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో సమావేశమయ్యారు. సైనికులకు స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ … పాకిస్తాన్‌కు హెచ్చరిక ఇచ్చారు. కచ్‌వైపు పాక్ కన్నెత్తి చూసే సాహసం చేయబోదని, ఇక్కడ రక్షణగా సుక్షితులైన సైనికులు ఉన్నారని వారికి తెలుసు అని అన్నారు. ”సర్ క్రిక్‌పై దాడికి గతంలో శత్రు దేశాలు కుట్రలు చేశాయి. ఇక్కడ రక్షణగా ఉన్న సైనికులుగా కుట్రలను తిప్పికొట్టారు.” అని మోడి అన్నారు. దౌత్యం పేరుతో సర్ క్రీక్‌ను లాక్కోవాలనే కుట్ర గతంలో జరిగిందని, గుజరాత్ ముఖ్యమంత్రిగా తాను దానిని వ్యతిరేకించానని ప్రధాని చెప్పారు. ప్రపంచం మొత్తం భారతదేశ శక్తిని చూస్తోందని ప్రధాని అన్నారు.