- కేంద్ర మంత్రి రాజ్‌భూషన్ చౌదరి
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : 2026 మార్చి నాటికి పోలవరం ఎర్త్ లెవెల్ (ఇఎల్) 41.15 పూర్తి చేయడానికి షెడ్యూల్ చేసినట్లు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి రాజ్‌భూషన్ చౌదరి తెలిపారు. రాజ్యసభలో వైసిపి ఎంపి వైవి సుబ్బారెడ్డి, బిజెడి ఎంపి సస్మిత్ పాత్ర అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం 2014 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే కాలానికి ప్రాజెక్టు నీటిపారుదల భాగానికి సంబంధించిన మిగిలిన ఖర్చులో వంద శాతం భరిస్తోందని తెలిపారు. ప్రస్తుతం అంచనా వేసిన టైమ్‌లైన్‌ల ప్రకారం, పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు కనిష్ట స్థాయి ఇఎల్ 41.15 మీటర్ల వరకు నీటి నిల్వను 2026 మార్చి నాటికి పూర్తి చేయడానికి షెడ్యూల్ చేసినట్లు తెలిపారు. 2021-22లో రూ.2,635.83 కోట్లు, 2022-23లో రూ.906.03 కోట్లు, 2023-24లో రూ.274.93 కోట్లు విడుదల చేశామన్నారు. రెండో సవరించిన అంచనాల్లో భాగంగా రూ.33,168.24 కోట్ల భూసేకరణ, పరిహారం, పునరావాసం కోసం అంచనా వేసినట్లు తెలిపారు. రూ.22,380.64 కోట్లు పనులు, విద్యుత్ కాంపొనెట్‌కు అంచనా వేశారని, మొత్తం రూ.55,656.87 కోట్లు (2017-18 ధరల సూచీ) ఈ అంచనాలను సాంకేతిక సలహా కమిటీ 2019 ఫిబ్రవరిలోనే 141వ సమావేశంలోనే ఆమోదించిందని తెలిపారు. అయితే, రివైజ్డ్ కాస్ట్ కమిటీ తన 2024 నివేదికలో ఎర్త్ లెవెల్ 41.15 మీటర్ల వరకు నీటి నిల్వతో పోలవరం నీటిపారుదల ప్రాజెక్టును పూర్తి చేయడానికి సవరించిన వ్యయం కోసం రూ.30,436.95 కోట్లను అంచనా వేసిందని, ఇందులో పరిహారం, పునరావాస కాంపోనెంట్‌లకు రూ.12,270.42 కోట్లు అని తెలిపారు.