- క్లయిమేట్ మార్చ్ నిర్వాహకుల నిర్బంధం
- పోలీసుల అదుపులో వాంగ్‌చుక్
- మరో 150 మంది కార్యకర్తలు కూడా
న్యూఢిల్లీ : పర్యావరణ కార్యకర్తలపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ‘క్లయిమేట్ మార్చ్’ చేపట్టేందుకు రాజధాని న్యూఢిల్లీ వైపు తరలి వస్తున్న పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్, మరో 150 మందిని పోలీసులు ఢిల్లీ సరిహద్దుల వద్ద సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అదుపులోకి తీసుకొని నిర్బంధించారు. క్లయిమేట్ మార్చ్ నేపథ్యంలో వేరువేరు కారణాలను సాకుగా చూపుతూ రాజధానిలో పలు ప్రాంతాల్లో ఈ నెల 5వరకు నిషేధాజ్ఞలు విధిస్తూ పోలీసులు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయంటూనే వాంగ్‌చుక్, ఇతరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత సెప్టెంబరు 1 నుంచి వాంగ్‌చుక్ నేతృత్వంలో క్లయిమేట్ మార్చ్ శాంతియుతంగా కొనసాగుతూవస్తోంది. హర్యానాలోని సింఘూ సరిహద్దు వద్ద సోమవారం రాత్రి తనను పోలీసులు నిర్బంధిస్తున్నారంటూ వాంగ్‌చుక్ సామాజిక మాధ్యమాల్లో తెలిపారు. ఆ తర్వాత కొద్ది సేపటికి ఆయనతో పాటు 150 మందిని వేరువేరు చోట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
క్లిష్టమైన ప్రాంతాలు దాటుకుంటూ…
లెహ్ లో గత నెల 1వ తేదీన వాంగ్‌చుక్ నేతృత్వంలో క్లయిమేట్ మార్చ్ ప్రారంభమైంది. అప్పటి నుండి వాంగ్‌చుక్, ఆయనతో పాటు ఉన్న 150 మంది లడఖ్ వాసులు కాలినడకన వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించారు. సముద్ర మట్టానికి 17,000 అడుగుల ఎత్తులో ఉన్న తగ్లాంగ్ పా పాస్ సహా పలు క్లిష్టతరమైన ప్రాంతాలను దాటుకుంటూ వారు గమ్యస్థానం వైపు అడుగులు వేశారు. మంగళవారం ఢిల్లీ చేరుకొని, బుధవారం గాంధీ జయంతి సందర్భంగా రాజ్‌ఘాట్‌లో నివాళులు అర్పించాలని వారు భావించారు. రాజ్యాంగంలోని ఆరో షెడ్యూలు కింద లడఖ్‌కు రక్షణ కల్పించాలన్న తమ డిమాండ్‌ను కేంద్రం దృష్టికి తేవడమే ఈ మార్చ్ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. అంతేకాదు…హిమాలయాలలో వాతావరణ మార్పుల కారణంగా తలెత్తుతున్న సమస్యలను భారతీయులతో పాటు ప్రపంచానికి అంతటికీ తెలియజేయాలన్నది కూడా వారి ఉద్దేశం.
ఆమోదయోగ్యం కాదు : రాహుల్
పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను, ఆయనతో పాదయాత్ర చేస్తున్న వారిని అదుపులోకి తీసుకోవడంపై ప్రతిపక్ష నేతలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. లడఖ్ భవిష్యత్తు కోసం పోరాడుతున్న వయోధికులను ఎందుకు నిర్బంధించారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిలదీశారు. పోలీసుల చర్య దారుణమని ఆప్ నేత, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. దేశ రాజధానిలో ప్రవేశించేందుకు ప్రతి వ్యక్తికీ హక్కు ఉన్నదని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.