జాహ్నవి మృతి కేసులో పోలీసు అధికారికి ఉద్వాసన

సియాటిల్‌, న్యూయార్క్‌ : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్ధిని జాహ్నవి కందుల మరణించిన కేసులో ఆ ప్రమాదానికి బాధ్యుడైన సియాటిల్‌ పోలీసు అధికారి కెవిన్‌ డేవ్‌ను పోలీసు విభాగం నుండి తొలగించినట్లు అధికారులు ప్రకటించారు. ఎవరినీ గాయపరచాలన్నది ఆ అధికారి ఉద్దేశం కానప్పటికీ ఆయన ప్రమాదకర డ్రైవింగ్‌ వల్ల జరిగిన విషాద పర్యవసానాలను తాము ఆమోదించలేకపోయామని సియాటిల్‌ తాత్కాలిక పోలీసు చీఫ్‌ సూ రాహెర్‌ చెప్పారు. సియాటిల్‌ పోలీసు డిపార్ట్‌మెంట్‌ నుండి కెవిన్‌ డేవ్‌కు ఉద్వాసన చెప్పినట్లు తెలిపారు. 2023 జనవరి 23న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జాహ్నవి సియాటిల్‌లో రోడ్డు దాటుతుండగా పోలీసు ఆఫీసర్‌ కెవిన్‌ డ్రైవ్‌ చేస్తున్న వాహనం దూసుకొచ్చి ఆమెను ఢ కొంది. డ్రగ్‌ ఓవర్‌డోస్‌ బాధితుడి నుండి కాల్‌ రావడంతో ఆ వ్యక్తిని తీసుకువచ్చేందుకు మితిమీరిన వేగంతో కెవిన్‌ కారు నడుపుతున్నాడు. కారు ఢ కొన్న వేగానికి జాహ్నవి వంద అడుగుల దూరంలో పడిపోయారు. బాధితుడిని త్వరగా చేరాలన్న ఆయనఉద్దేశం ఒక మనిషి ప్రాణాన్ని తీసిందని, సియాటిల్‌ పోలీసు విభాగానికి అపఖ్యాతి తెచ్చిపెట్టిందని, అందువల్ల ఆ వ్యక్తి చర్యను సమర్ధించలేమని పోలీసు చీఫ్‌ వ్యాఖ్యానించారు. అందుకే కెవిన్‌ను పోలీసు శాఖ నుండి తొలగించినట్లు చెప్పారు. ఈ మేరకు ఆమె ఒక ఇ మెయిల్‌ పంపారు. సియాటిల్‌ టైమ్స్‌ ఈ వార్తా కథనాన్ని ప్రచురించింది. పైగా గస్తీ వాహనం తిరిగేటపుడు ఎమర్జన్సీ లైట్లు ఉపయోగించడం వంటి ముందు జాగ్రత్తలు తీసుకోలేదని ఆమె పేర్కొన్నారు. జాహ్నవి మృతిపై అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ, నవ్విన ఓ పోలీసు అధికారి డేనియల్‌ ఆడెరర్‌కు ఉద్వాసన చెప్పిన కొన్ని నెలలకే కెవిన్‌ ఉద్వాసన చోటు చేసుకుంది. డేనియల్‌, కెవిన్‌ డేవ్‌లపై చర్య తీసుకోవడంతో కందుల కుటుంబానికి న్యాయం జరిగినట్లైందని భావిస్తున్నారు.

➡️