పాట్నా : బీహార్‌లో కాంగ్రెస్ ర్యాలీపై శుక్రవారం పోలీసులు లాఠీలు, వాటర్ కెనాన్‌లతో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ సహ పలువురిని అదుపులోకి తీసుకున్నారు. నిరుద్యోగ సమస్యలపై కాంగ్రెస్ ఈ ర్యాలీ చేపట్టింది. ‘వలసవాదాన్ని ఆపండి, ఉద్యోగాలు ఇవ్వండి’ అని నినాదాలు చేపడుతూ కాంగ్రెస్ బిపిసిసి ప్రధాన కార్యాలయం సదాకత్ ఆశ్రమం నుండి మార్చ్ ప్రారంభించింది. రాజాపుల్ కాస్రింగ్ చేరుకోగానే పోలీసులసు వారిపై విరుచుకుపడ్డారు. వారిని చెదరగొట్టేందుకు లాఠీలు, వాటర్ కెనాన్‌లు ప్రయోగించారు. ఈ ర్యాలీ ప్రారంభానికి ముందు కార్యకర్తలనుద్దేశించి ఎఐసిసి ప్రధాన కార్యదర్శి సచిన్ పైలెట్, కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా శ్రీనటె మాట్లాడారు. బీహార్‌లోని పాలక ఎన్‌డిఎ ముందుకు కదలని, పొగను మాత్రమే వదిలే డబుల్ ఇంజిన్ సర్కార్ అని సచిన్ పైలెట్ విమర్శించారు. బిజెపి కేంద్రంలో అధికారంలో కొనసాగేందుకు జెడి(యు)పై ఆధారపడినప్పటికీ, రాష్ట్ర ప్రయోజనాలు పొందడంలో నితీష్ కుమార్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.
