రాజకీయ, సాంస్కృతిక వ్యూహం

  • లౌకిక, ప్రజాస్వామ్య, ప్రగతిశీల శక్తుల్లో కొత్త ఆశలు 
  • ఎన్నడూ లేనంత ఒత్తిడిని ఎదుర్కొంటున్న దేశ ప్రజాస్వామ్య పునాదులు
    ఇంటర్వ్యూలో సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబి

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశ ప్రజాస్వామ్య పునాదులు ఎన్నడూ లేనంత ఒత్తిడిని ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఏప్రిల్‌ 2 నుండి 6 వరకు మదురైలో జరిగిన సిపిఎం 24వ పార్టీ మహాసభ సంకల్పం, ప్రతిఘటనకు ఒక వెలుగులా ఉద్భవించిందని సిపిఎం నూతన ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబి తెలిపారు. మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం రాజ్యాంగ విలువలను క్షీణింపజేస్తోందని, మతపరమైన విభజనలను తీవ్రతరం చేస్తోందని విమర్శించారు. వామపక్షాల రాజకీయ, సాంస్కృతిక వ్యూహాన్ని ధైర్యంగా పునఃసమీక్షించాలని మహాసభ పిలుపునిచ్చిందన్నారు. మహాసభ తీర్మానాలు దేశవ్యాప్తంగా లౌకిక, ప్రజాస్వామ్య, ప్రగతిశీల శక్తుల్లో కొత్త ఆశను, ఉత్సాహాన్ని రేకెత్తించాయని చెప్పారు. దేశాభిమాని పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివిధ అంశాలను వెల్లడించారు. మతతత్వ శక్తులు, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని తీవ్రతరం చేయడానికి పార్టీ మహాసభ ఆమోదించిన కార్యాచరణ ప్రణాళికను వివరించారు.

ప్రశ్న : సిపిఎం స్వతంత్ర బలం పెంచుకోవాలనే పార్టీ మహాసభ పిలుపును రాజకీయంగా ఎలా అర్థం చేసుకోవాలి?
బేబి : పార్టీ మహాసభ రెండు కీలకమైన పనులను నిర్దేశించింది. మొదట సిపిఎం సొంత బలం పెంచడం, వామపక్షాల ఐక్యత పెంపొందించడం. రెండోది ప్రమాదకరమైన మోడీ పాలనకు వ్యతిరేకంగా తక్షణమే రాజకీయంగా జోక్యం చేసుకోవడం. మహాసభ ఆమోదించిన రాజకీయ తీర్మానం దీనినే స్పష్టం చేస్తుంది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తిరోగమనం మాత్రమే కాదు, ఇది భారతీయ సమాజం మొత్తాన్ని విషపూరితం చేస్తున్న స్పష్టమైన నయా ఫాసిస్ట్‌ ధోరణులను ప్రదర్శిస్తోంది. మోడీ ప్రభుత్వం ఒకదాని తరువాత ఒకటి తీసుకున్న చర్యలు మన రాజ్యాంగ విలువలన్నింటినీ నాశనం చేస్తున్నాయి.
పార్టీ మహాసభ ముగిసిన తర్వాత ఒకేరోజున రెండు ముఖ్యమైన పరిణామాలు జరిగాయి. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను నిరోధించడంలో గవర్నర్‌ చర్య తప్పు అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని దెబ్బతీస్తోందనే సిపిఎం వైఖరిని ఈ తీర్పు బలపరుస్తుంది. మోడీ ప్రభుత్వం ప్రజలపై ఆర్థిక దాడిని కొనసాగిస్తోంది. పెట్రోల్‌, డీజిల్‌పై సుంకాలు పెంచారు. వంట గ్యాస్‌ ధరను పెంచారు. ఇవన్నీ సాధారణ ప్రజలపై భారాలు పడుతున్నాయి. ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా విస్తృత ఉద్యమాన్ని నిర్మించాలంటే సిపిఎం బలాన్ని పదిరెట్లు పెంచాలి. సంస్థాగతంగా, పార్టీ, వర్గ ప్రజా సంఘాల ప్రభావం, సామర్థ్యాన్ని పెంచాలి. దీనికి ఉపయోగపడే అనేక విషయాలను పార్టీ మహాసభ నిర్మాణ నివేదికలో చర్చించాం. మానవులకు జీవ కణాల వలె, పార్టీకి జీవ కణాలైన శాఖలు చాలా ముఖ్యమైనవి. దేశవ్యాప్తంగా దాదాపు లక్ష శాఖలు ఉన్నాయి. శాఖల కార్యకలాపాలను సమన్వయం చేసే స్థానిక కమిటీలు, ఉపకమిటీలు ఉన్నాయి. జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు, కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో ఉన్నాయి. ఈ కమిటీలన్నింటినీ అనేక రెట్లు పెంచాలని పార్టీ మహాసభ నిర్ణయించింది. శాఖలకు అవసరమైన శిక్షణను రాష్ట్ర కమిటీలు నిర్ణయించాలి. కమిటీలు మరింత చురుగ్గా ఉండాలి. వాటి పోరాట సామర్థ్యాన్ని పెంచాలి.

ప్రశ్న : కొత్త తరహా పోరాట నమూనాలను ఎలా తీసుకుంటారు?
బేబి: ప్రజల జీవితాలను ప్రభావితం చేసే అంశాలపై స్థానికంగా ఆందోళనలను చేపట్టాలి. కన్నూర్‌ పార్టీ మహాసభలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా, గత మూడేళ్లుగా అనేక రాష్ట్రాల్లో ప్రజా సమస్యలను లేవనెత్తుతూ బలమైన ఆందోళనలు జరిగాయి. దీర్ఘకాలికంగా సాగే ఇటువంటి పోరాటాలను విజయవంతం చేయడంపై దృష్టి పెట్టాలని మహాసభ నిర్ణయించింది. పంటల బీమా డిమాండ్‌పై రాజస్థాన్‌లో రైతులు చేసిన పోరాటం, ఇళ్లు లేనివారికి ఇళ్ల స్థలాల కోసం డిమాండ్‌ చేస్తూ తెలంగాణలో జరిగిన ఆందోళన ఇందుకు ఉదాహరణలు. ఇవన్నీ విజయవంతమయ్యాయి. పార్టీ సభ్యులు పనిచేసే చోట ప్రజా సంఘాలు వ్యూహాత్మక కార్యకలాపాలను చేపట్టాలని కన్నూర్‌ మహాసభలో నిర్ణయించాం. వయనాడ్‌ కొండచరియల విపత్తు బాధితులకు ఇళ్లు అందించే ప్రాజెక్టులో భాగంగా డివైఎఫ్‌ఐ కార్యకర్తలు రూ.20.4 కోట్లు సేకరించారు. వ్యర్థ పదార్థాలను సేకరించి విక్రయించి బిర్యానీ ఛాలెంజ్‌ నిర్వహించారు. ఈ విధంగా సేకరించిన మొత్తాన్ని పార్టీ కేంద్ర కమిటీకి సమర్పించినప్పుడు చాలామందికి ఆశ్చర్యం కలిగింది. ఆందోళనలు, అటువంటి కార్యకలాపాలతో సాధించిన విజయాలను మదురై పార్టీ మహాసభ చర్చించింది. ఇది కొత్త పోరాట నమూనాలను చేపట్టడానికి మాకు స్ఫూర్తినిస్తుందని నేను ఆశిస్తున్నాను. ఆందోళనలను కొత్త స్థాయికి తీసుకెళ్లడమే దీని ఉద్దేశం.

ప్రశ్న : సంఘ్ పరివార్‌ను సైద్ధాంతికంగా, సాంస్కృతికంగా ఎదుర్కోవడానికి ప్రణాళికను ఎలా అమలు చేయాలనుకుంటున్నారు?
బేబి: సంఘ్ పరివార్‌ ప్రభావం సమాజంలో లోతుగా పాతుకుపోయింది. ఆర్‌ఎస్‌ఎస్‌ అనేక పేర్లతో, వివిధ రూపాల్లో ఉన్న సంస్థల ద్వారా పనిచేస్తుంది. మన దేశంలోని చాలా రాజకీయ పార్టీలు దీనివల్ల కలిగే ముప్పును తీవ్రంగా పరిగణించడానికి ఇష్టపడటం లేదు. కానీ వారందరూ బిజెపిని తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్న మరో రాజకీయ పార్టీగా చూస్తున్నారు. అందుకే కాంగ్రెస్‌, ఎస్‌పి వంటి పార్టీలన్నీ బిజెపికి వ్యతిరేకంగా రాజకీయ వైఖరి తీసుకుంటున్నాయి. బిజెపిని కేవలం ఒక రాజకీయ పార్టీగా చూడలేము. సిపిఎం కార్యక్రమంలో పేర్కొన్నట్లుగా, బిజెపి అనేది ఫాసిస్ట్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ నియంత్రణలో పనిచేస్తున్న ఒక రాజకీయ పార్టీ. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రణాళికను సాకారం చేయడానికి ఏర్పడింది. దేశంలోని ఇతర ప్రతిపక్ష పార్టీలు ఈ కోణంలో చూడకపోవడం వల్ల సంఫ్‌ు పరివార్‌కు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో కూడా పరిమితులు ఏర్పడుతున్నాయి. విస్తృత ప్రతిపక్షాల్లో ఈ స్పష్టత లేకపోవడం సంఫ్‌ు పరివార్‌ పట్ల సైద్ధాంతిక ప్రతిఘటనను బలహీనపరుస్తుంది.

ప్రశ్న : సంఘ పరివార్‌కు వ్యతిరేకంగా సిపిఎం, వామపక్షాల వైఖరి ఎలా వ్యాప్తి చేయబోతున్నారు?
బేబి: 1990ల ప్రారంభంలో దేశ రాజకీయాల్లో బిజెపి ముప్పుగా ఎదగడం ప్రారంభించినప్పుడు, ‘ఫ్రంట్‌లైన్‌’ వారపత్రిక ఆరెస్సెస్‌ అంటే ఏమిటి? అనే దానిపై అప్పటి సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరి రాసిన ‘వాట్‌ ఈజ్‌ హిందూ స్టేట్‌’ అనే వ్యాసం ప్రచురించింది. దీనిని ఫ్రంట్‌లైన్‌ స్వయంగా పుస్తకంగా ప్రచురించింది. ఇప్పుడు పార్టీ మహాసభ సందర్భంగా దాన్ని తిరిగి ప్రచురించారు. బిజెపి వేరే తరహా రాజకీయ పార్టీ అని సిపిఎం, ఇతర వామపక్ష పార్టీలు పదే పదే చెబుతున్నాయి. బూర్జువా మీడియా ఆధిపత్యం ఉన్న భారతీయ సమాజంలో ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపిల గురించి సిపిఎం, వామపక్షాల వైఖరి తగినంతగా వ్యాప్తి చెందడం లేదు. ఈ బలహీనతను అధిగమించడానికి పెద్దయెత్తున కృషి చేయాలని పార్టీ మహాసభ నిర్ణయించింది. ఇది ఒక సాంస్కృతిక, రాజకీయ లక్ష్యం. ఇది కేవలం సాంస్కృతిక సంఘాలపై ఆధారపడటంతోనే నిర్వహించలేం. అన్ని వర్గ, ప్రజా సంఘాల్లో వివిధ స్థాయిలలోని అంశాల్లో సాంస్కృతిక జోక్యానికి ఒక సంస్థాగత వ్యవస్థ ఉండాలి. ప్రస్తుతం ఇది ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాల రూపంలో జరుగుతోంది. అయితే, సంఫ్‌ు పరివార్‌ సంస్థలు వ్యక్తిగతంగా, సమిష్టిగా ఇళ్లలో, కార్యాలయాల్లో నిర్వహించే సూక్ష్మమైన పనిపై దృష్టి పెట్టాలి. దీనిని ఎదుర్కోవడానికి, ప్రజలను వారి నివాస ప్రాంతాల్లో సందర్శించడం, వారితో ఓపికగా మాట్లాడటం, మతపరమైన ఆలోచనల పట్టు నుండి వారిని విడిపించడానికి కార్యక్రమాలను సిద్ధం చేయడంతో మనం వివిధ స్థాయిలలో క్రమపద్ధతిలో పనిచేయాలి.

ప్రశ్న: పెరుగుతున్న బిజెపి ప్రభావాన్ని సమర్థవంతంగా ఎలా బలహీనపరచవచ్చు?
బేబి: కేంద్రంలో అధికారంలో ఉండటం వల్ల కొన్ని వర్గాల ప్రజలు బిజెపి వైఖరిని అంగీకరించడానికి మార్గం సుగమం చేసింది. సంఫ్‌ు పరివార్‌ చేతులకు గాంధీజీ రక్తం మరకలు ఉన్నాయని, గాంధీజీని చంపిన తుపాకీతోనే గుజరాత్‌ మారణహోమం చేసి కల్బుర్గి, గౌరీ లంకేష్‌, దభోల్కర్‌ ప్రాణాలను తీశారని మన దేశంలో అందరికీ అర్థమయ్యేలా చేస్తేనే కేంద్రంలో, మెజారిటీ రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న వారిని మనం తరిమికొట్టగలం. వారు రెండు శాతం ఓట్ల తేడాతో కేంద్రంలో అధికారంలో ఉన్నారు. అందువల్ల, మోడీని ఓడించగల శక్తులు ఆయన చుట్టూ ఉన్నాయనే వాస్తవిక, ఆశావాద నమ్మకాన్ని మనం ప్రజల్లో కలిగించగలగాలి. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమితో మతతత్వానికి వ్యతిరేకంగా పోరాటం ముగియదు. ఈ శక్తులు దశాబ్ద కాలంగా క్రమపద్ధతిలో భారతీయ సమాజంలోని దాదాపు ప్రతి భాగాన్ని మతోన్మాదంతో విషపూరితం చేశారు. భారతీయ సమాజాన్ని పరిరక్షణకు ఒక భారీ రాజకీయ, సాంస్కృతిక చికిత్సను చేపట్టాల్సిన అవసరం ఉంది. దీనిని సాధించడానికి సిపిఎం, భావసారూప్యత కలిగిన పార్టీలు, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక సంస్థలు, వ్యక్తులు ఐక్యంగా ఉండాలని పార్టీ ప్రతిపాదిస్తుంది. దీనిని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే సిపిఎం, వామపక్షాలు పదిరెట్లు బలాన్ని పొందాలి.

ప్రశ్న: సోషలిజమే ప్రత్యామ్నాయం అనేదాన్ని దేశంలో ఎలా ప్రచారం చేయబోతున్నారు?
బేబి: సాధారణంగా ప్రపంచ పరిస్థితిని అంచనా వేసేటప్పుడు, కొన్ని చోట్ల తీవ్ర మితవాద పెరుగుదలను ఉదహరిస్తూ కమ్యూనిస్టులు, వామపక్షాలకు భవిష్యత్తు లేదని వాదించేవారు ఉన్నారు. కానీ కమ్యూనిస్టులు, వామపక్షాల ప్రభావం లేని ప్రపంచం భవిష్యత్తు గురించి ఆలోచనాపరులైన ప్రజలు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. సామ్రాజ్యవాద, పెట్టుబడిదారీ దేశాలు కోట్లాది మంది ప్రజలపై ఎన్ని భరించలేని కష్టాలను రుద్దుతున్నాయి? ఆక్స్‌ఫామ్‌ వంటి స్వతంత్ర పరిశోధనా బృందాలు దీనిపై గణాంకాలను అందిస్తాయి. ప్రపంచ జనాభాలో 95 శాతం మంది సంపద మొత్తం కంటే, ఒక శాతం మంది అత్యంత ధనవంతుల సంపద ఎక్కువ. బిలియనీర్ల సంపద ప్రతిరోజూ 2.7 బిలియన్‌ డాలర్లు పెరుగుతోంది. మరోవైపు ద్రవ్యోల్బణం 1.7 బిలియన్ల కార్మికుల వాస్తవిక ఆదాయాన్ని తగ్గిస్తోంది. ఔషధాలు, వ్యవసాయం, సాంకేతికత వంటి రంగాలలో ఒక సమూహం ప్రపంచ గుత్తాధిపత్యాన్ని సాధించింది. ఏడు సోషల్‌ మీడియా, టెక్నాలజీ, చిప్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 12 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంది. వారు ఈ ఆధిపత్యాన్ని ఉపయోగించి ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేస్తున్నారు. రాజకీయ జోక్యం చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు పన్నులు తగ్గించడం ద్వారా, కార్మిక చట్టాలను బలహీనపరచడం ద్వారా కార్పొరేట్లకు సహాయం చేస్తున్నాయి.
ప్రపంచంలో ఉక్రెయిన్‌, గాజాలో దోపిడీ వ్యవస్థ సృష్టించే యుద్ధాలు, మారణహోమాన్ని మనం చూస్తున్నాము. అధిక లాభాల కోసం సహజ వనరులను దోపిడీ చేయడం వెనుక పెట్టుబడిదారీ విధానం చోదక శక్తిగా ఉంది. ప్రపంచ జనాభాలో 25 శాతం మంది మరింత సమానత్వ సమాజాలను నిర్మించడానికి మార్గాలను అన్వేషిస్తున్న దేశాలలో నివసిస్తున్నారని అంచనా. అందువల్ల, ప్రపంచ పరిణామాలను జాగ్రత్తగా అంచనా వేసే వారికి పెట్టుబడిదారీ విధానం దుస్థితిని అంతం చేయవచ్చని ఆశ ఉంటుంది.

ప్రశ్న : ప్రపంచంలో దేశాల మధ్య వైరుధ్యాలు వేర్వేరుగా ఉన్నాయి కదా!, అన్ని దేశాల్లో పరిస్థితులను ఒకేలా అర్థం చేసుకోవడం సాధ్యమా?
బేబి: అవును, ప్రపంచంలోని దేశాల మధ్య వైరుధ్యాలు ఉన్నాయి. అన్ని దేశాల్లో పరిస్థితులు ఒకేలా ఉండవు. కానీ అనేక దేశాల్లో ప్రజలు దోపిడీకి గురవుతున్నారు. అందుకే ప్రతి దేశానికి అనువైన రూపంలో సమానత్వ సమాజాన్ని అభివృద్ధి చేయవచ్చని సిపిఎం ధృడంగా విశ్వసిస్తుంది. భారత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సమానత్వ సమాజం, సోషలిస్ట్‌ సమాజం, జనతా ప్రజాస్వామ్య మార్గం ద్వారా నిర్మించాలనే ఆలోచనను పార్టీ 24వ మహాసభ ముందుకు తెచ్చింది. ప్రపంచంలోలానే, భారతదేశంలో 2017-18లో మొత్తం పన్ను ఆదాయంలో కార్పొరేట్‌ పన్ను వాటా 32 శాతం. 2024-25లో ఇది 26.5 శాతానికి తగ్గింది. 2014-15లో 20.8 శాతంగా ఉన్న ఆదాయపు పన్ను వాటా 2024-25లో 30.9 శాతానికి పెరిగింది. కార్పొరేట్‌ పన్ను కోతల వల్ల ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.1.45 లక్షల కోట్లు నష్టపోతోంది. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత అసమానతలు కలిగిన దేశంగా మారింది. జనాభాలో ఒక శాతం మంది నియంత్రణలో దేశ ఆదాయంలో 22.6 శాతం ఉంది. దేశ సంపదలో 40.1 శాతం వారివద్దే ఉంది.

ప్రశ్న : భారతదేశం బలమైన మత ప్రభావం కలిగిన దేశం. కమ్యూనిస్టులు, సోషలిస్టులు మతం పట్ల అనుసరిస్తున్న వైఖరి గురించి జరుగుతున్న కొన్ని ప్రచారాలు సిపిఎం బలోపేతానికి ఆటంకం కలిగించడం లేదా?
బేబి: కమ్యూనిస్టులు మత వ్యతిరేకులనేది నిరాధారమైన ప్రచారం. కమ్యూనిస్టులు మత విశ్వాసాలకు వ్యతిరేకం కాదు. మతం పేరుతో జరుగుతున్న ఉన్మాద చర్యలకు, మతోన్మాదానికి, మత విద్వేషాలకు వ్యతిరేకం. 1864లో ఇంటర్నేషనల్‌ వర్కింగ్‌ మెన్స్‌ అసోసియేషన్‌ (ఫస్ట్‌ ఇంటర్నేషనల్‌)ను కార్ల్‌ మార్క్స్‌, ఫ్రెడరిక్‌ ఎంగెల్స్‌, మిఖాయిల్‌ బకునిన్‌ ఏర్పాటు చేసినప్పుడు దీనిని స్పష్టం చేశారు. రష్యన్‌ విప్లవకారుడు బకునిన్‌ ఇంటర్నేషనల్‌లో మతపరమైన భావజాలాలతో సంబంధం లేని వారిని మాత్రమే సంస్థలో సభ్యత్వంలోకి చేర్చాలని వాదించారు. మార్క్స్‌, ఎంగెల్స్‌ దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. కార్మికుల విముక్తి కోసం పోరాటంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్న అన్ని మతపరమైన విశ్వాసులను సంస్థలో చేర్చవచ్చని మార్క్స్‌, ఎంగెల్స్‌ వాదించారు. బకునిన్‌ వైఖరిని అంగీకరించే యాంత్రిక భౌతికవాదాన్ని సిపిఎం సమర్థించదు. మత విశ్వాసులను సమీకరించడంతో మతతత్వానికి వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేయడం, విస్తరించడం సిపిఎం వైఖరి. ఇది 24వ పార్టీ మహాసభ డాక్యుమెంట్‌ నిస్సందేహంగా స్పష్టం చేసింది.

➡️