- ఎన్నికల ప్రచారంలో సిఎం చంద్రబాబు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాజకీయ కాలుష్యంతో ఢిల్లీ కలుషితమైందని సిఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని గెలిపించాలని అక్కడి తెలుగు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, టిడిపి ఎంపిలు, రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు పాల్గొన్నారు. షాద్రా బిజెపి అభ్యర్థి సంజరు గోయల్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సరైన నాయకుడు మనదేశానికి సరైన సమయంలో ఉన్నారని, ఆయనే మోడీ అని అన్నారు. ఢిల్లీలో ఇంతమంది తెలుగువారు ఉంటారని అనుకోలేదని అన్నారు. మోడీ నాయకత్వాన్ని ప్రపంచ దేశాలు హర్షిస్తున్నాయని చెప్పారు. 1995లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి తాను మాట్లాడానని అన్నారు. ఇప్పుడు ప్రతి ఇంటికీ ఒక ఎఐ తయారుకావాలని చెప్పారు. ఢిల్లీలో ఉన్న తెలుగు తమ్ముళ్లు ఇంటింటికీ వెళ్లి బిజెపి గెలుపు దేశ చరిత్రకు మలుపు అనేలా చెప్పాలని అన్నారు. ‘దేశం బ్రాండ్ మోగడానికి మోడీ కారణం. 2047 నాటికి భారత్ నెంబర్‌వన్‌గా తయారవుతుంది. ఢిల్లీని చూస్తుంటే చాలా బాధగా ఉంది. 1993లో హైదరాబాద్ ఎలా ఉందో ఢిల్లీ ఇప్పుడు అలానే ఉంది. ఢిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చి ఉంటే ఢిల్లీ వాషింగ్టన్ లాగా ఉండేది. ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోయింది. ఆ గాలితో ప్రజలు ఎలా ఉన్నారో తెలియడం లేదు. చాలామంది హైదరాబాద్, బెంగళూరు వెళ్లాలని అనుకుంటున్నారు. రాజకీయ కాలుష్యంతో ఢిల్లీ కలుషితమైంది. బిజెపి గెలిస్తే ఢిల్లీ బాగుపడు తుంది. నరేంద్ర మోడీ మోక్షం ఇస్తే తప్ప ఢిల్లీ బాగుపడదు. ఢిల్లీ అభివృద్ధి కావాలంటే బిజెపి అధికారంలోకి రావాలి. దేశానికి ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చింది. అయితే ఢిల్లీ సమస్యల వలయంలో చిక్కుకుంది. పదేళ్లలో ఏం చేశారంటే, స్కూళ్లు పెట్టమని అంటున్నారు. ఢిల్లీ మురికి కూపంలా మారింది. ఢిల్లీలో స్వచ్ఛమైన మంచినీరు తాగే పరిస్థితి లేదు. బీహార్ నుంచి ఉపాధికి ఢిల్లీ వచ్చేవారు, ఇప్పుడు అందరూ దక్షిణ భారతదేశానికి వస్తున్నారు. ఢిల్లీలో అభివృద్ధి ఆగిపోయింది. బిజెపి ఎన్నికల మేనిఫెస్టో అద్భుతంగా ఉంది. ప్రతి మహిళకూ రూ.2,500, గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు బాగున్నాయి’ అని సిఎం చంద్రబాబు పేర్కొన్నారు. బిజెపి బహిరంగ సభలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, ఎపి బిజెపి నేతలు మాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి, రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.