యుపి పవర్ స్టేషన్‌లో ప్రమాద ప్రభావం
న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్‌లోని మండోలలో ఒక విద్యుత్ సబ్ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం సంభవించడంతో ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈ విషయాన్ని ఢిల్లీ విద్యుత్ శాఖ మంత్రి అతిషి తెలిపారు. విద్యుత్ పునరుద్ధరణకు అధికారులు, ఇంజనీర్లు కసరత్తు చేస్తున్నారని, త్వరలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని చెప్పారు. ‘ఢిల్లీలో అనేక ప్రాంతాల్లో మధ్యాహ్నం 2:11 గంటల నుంచి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఉత్తరప్రదేశ్‌లోని మండోలలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పిజిసిఐఎల్) సబ్ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం కారణంగా ఈ అంతరాయం కలిగింది. ఈ సబ్ స్టేషన్ నుంచి ఢిల్లీకి 1200 మెగావాట్ల విద్యుత్ సరఫరా జరుగుతుంది. అందువల్లనే ఢిల్లీలోని అనేక ప్రాంతాలపై ప్రభావం పడింది’ అని ఆమె తెలిపారు. విద్యుత్ పునరుద్ధరణ ప్రక్రియ ప్రారంభమైనట్లు చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరిగినట్లు మంత్రి తెలిపారు.
